అమెరికాలో పర్యటిస్తున్న భారతీయులకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వీసాల దుర్వినియోగం లేదా దేశంలోకి అక్రమ ప్రవేశాన్ని వాషింగ్టన్ సహించదని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తన తాజా సందేశంలో పేర్కొంది. నెవార్క్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థినిని బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా ఈ ప్రకటన చేసింది.
చట్టబద్ధమైన ప్రయాణికులను తమ దేశానికి ఆహ్వానిస్తామని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తన సందేశంలో పేర్కొంది. అయితే, అక్రమంగా అమెరికాను సందర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవేశించడం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాల ఉల్లంఘనను సహించబోమని భారత్ లోని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
నెవార్క్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని నేలపై బోర్లా పడుకోబెట్టి చేతులు వెనక్కు విరిచి కట్టేసి బేడీలు వేసి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త కునాల్ జైన్ షేర్ చేస్తూ విద్యార్థి ఏడుస్తున్నాడని, అతడిని అక్కడి పోలీసులు నేరస్థుడిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థి అమెరికా నుంచి భారత్ కు తిప్పి పంపించారు. ‘అతడు నేరాలు చేయడానికి అమెరికా రాలేదు. తన కలలను సాకారం చేసుకోవడానికి వచ్చాడు. అతడిని చూస్తుంటే హృదయం ద్రవించింది. అతడి భాషను గమనిస్తే, అతడు భారత్ లోని హర్యానా ప్రాంతం నుంచి వచ్చినట్లు అనిపించింది’’ అని హెల్త్ బాట్స్ ఏఐ కంపెనీ ఫౌండర్ అయిన కునాల్ జైన్ ఆ పోస్ట్ లో రాశారు.
వీడియోపై స్పందించిన న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ‘‘నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ భారతీయుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీనికి సంబంధించి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని భారత అధికారులు ఎక్స్ లో పేర్కొన్నారు. అమెరికాలో వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. సామూహిక బహిష్కరణల నుంచి ఐసీఈ వ్యతిరేక నిరసనలను చెదరగొట్టేందుకు లాస్ ఏంజిల్స్ లో నేషనల్ గార్డ్ ను మోహరించడం వరకు ట్రంప్ ప్రభుత్వం అమెరికా వీసాలకు కఠిన నిబంధనలు జారీ చేసింది.
సంబంధిత కథనం