గదిలోకి మహిళ వెళ్లడం అంటే శృంగారానికి సిద్ధంగా ఉందని అర్థం కాదు : రేప్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
Rape Case : ఓ రేప్ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఒక మహిళ గదిలోకి వెళ్లడం అంటే శృంగారానికి సిద్ధంగా ఉందని అర్థం కాదని వెల్లడించింది.
అత్యాచారానికి సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక మహిళ ఒక పురుషుడితో హోటల్ గదిలోకి ప్రవేశించిందంటే, ఆమె లైంగిక సంబంధానికి అంగీకరించిందని అర్థం కాదని కోర్టు తెలిపింది. నిందితుడిపై అత్యాచారం కేసును మూసివేసిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
నిందితుడు, ఫిర్యాదుదారుడు హోటల్ గదిని బుక్ చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని కోర్టు చెప్పింది. అయితే ఇది లైంగికంగా కలిసేందుకు మహిళ అనుమతి ఇచ్చినట్టుగా చూడలేమని పేర్కొంది. బాధితురాలు నిందితుడితో కలిసి గదిలోకి ప్రవేశించిందని భావించినా.. అది లైంగిక సంబంధాలకు ఆమె సమ్మతిగా ఏ విధంగానూ పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
2020 మార్చిలో నిందితుడు గుల్షేర్ అహ్మద్ విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను నమ్మించాడు. మీటింగ్ నెపంతో యువతిని హోటల్ గదికి పిలిపించుకున్నాడు. మహిళ, పురుషుడు ఇద్దరూ కలిసి గదిని బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత గదిలోకి వెళ్లగానే నిందితుడు తనను చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బార్ అండ్ బెంచ్ కథనం ప్రకారం.. నిందితుడు బాత్‌రూమ్ వెళ్లగానే, తాను గది నుండి పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చానని బాధితురాలు చెప్పింది.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ట్రయల్ కోర్టుకు చేరుకోగా.. మహిళ ఇష్టపూర్వకంగా గదిలోకి ప్రవేశించినందున, ఆమె శృంగారానికి అంగీకరించిందని చెప్పి కోర్టు నిందితుడిని విడిచిపెట్టింది. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ఎలాంటి నిరసన లేకుండా బాధితురాలు గదిలోకి ప్రవేశించడం, గదిలో ఏం జరిగిందో తెలపడం వంటి రెండు వేర్వేరు అంశాలను ట్రయల్ జడ్జి కలిపారని కోర్టు తెలిపింది.
హోటల్ సిబ్బంది కూడా మొత్తం కథను వివరించారని, ఇది బాధితురాలి వాంగ్మూలాన్ని పోలి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారని, ఆ గదికి వెళ్లడానికి మహిళకు ఎలాంటి ఇబ్బంది లేదని హైకోర్టు పేర్కొంది. అయితే గదికి వెళ్లినంత మాత్రన ఆమె శృంగారానికి అంగీకరించిందన్న నిందితుడి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు నిందితుడిపై కేసును కొనసాగించింది.