Insurance Money : రూ.70 లక్షల బీమా డబ్బుల కోసం 2 సార్లు చనిపోయిన మహిళ.. మరో ప్లాన్ ఫెయిల్!-women died two times for insurance money mumbai family create fake death certificates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Insurance Money : రూ.70 లక్షల బీమా డబ్బుల కోసం 2 సార్లు చనిపోయిన మహిళ.. మరో ప్లాన్ ఫెయిల్!

Insurance Money : రూ.70 లక్షల బీమా డబ్బుల కోసం 2 సార్లు చనిపోయిన మహిళ.. మరో ప్లాన్ ఫెయిల్!

Anand Sai HT Telugu
Jul 01, 2024 02:06 PM IST

Crime News : ఓ కుటుంబం నాలుగు బీమా కంపెనీలకు తప్పుడు పత్రాలు ఇచ్చి రూ.70 లక్షలు క్లెయిమ్ చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివిధ బీమా కంపెనీల ద్వారా మొత్తం రూ.1.1 కోట్లకు రెండు పేర్లతో బీమా చేయించారు.

ఇన్సురెన్స్ డబ్బుల కోసం నకిలీ పత్రాలు
ఇన్సురెన్స్ డబ్బుల కోసం నకిలీ పత్రాలు (Unsplash)

అత్యవసర పరిస్థితుల్లో జీవిత బీమా పాలసీలు ఉపయోగపడతాయని తీసుకుంటాం. కుటుంబ సభ్యులు అయినా సంతోషంగా ఉంటారని అనుకుంటాం.. కానీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చేయకూడని పనులు చేయడం చాలా మందికి అలవాటు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపిన సందర్భాలు అనేకం. బీమా చేసిన వ్యక్తి మరణానికి సంబంధించిన తప్పుడు రికార్డు సృష్టించి బీమా కంపెనీ నుంచి పరిహారం పొందిన సందర్భాలూ చాలా ఉన్నాయి. అలాంటి ఘటనే ముంబైలోని ఓ కుటుంబం చేసింది.

ఓ కుటుంబానికి చెందిన మహిళ, ఆమె భర్త, కుమారుడు, మరో వైద్యుడు ఏకంగా నాలుగు బీమా కంపెనీలను మోసం చేసి రూ.70 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు కంచన్ పాయ్, ఆమె భర్త రోహిత్ పాయ్, కుమారుడు ధనరాజ్ పాయ్, ముంబైలోని భయాందర్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ అశుతోష్ యాదవ్‌ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ నలుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే నిందితులు ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు.

ప్రధాన నిందితురాలు కంచన్ పాయ్.. పవిత్ర అనే పేరుతో కూడా బీమా పాలసీలు తీసుకుంది. నాలుగు బీమా కంపెనీల్లో కోటి రూపాయలకు పైగా జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసింది. దీని తరువాత ఆమెకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులు ఆమె చనిపోయినట్లు పత్రాలు ఇచ్చి బీమా డబ్బును క్లెయిమ్ చేశారు.

నకిలీ మరణ ధృవీకరణ పత్రం, నకిలీ అంత్యక్రియలు.. ఇలా అన్నింటిని సృష్టించారు. అశుతోష్ యాదవ్ అనే వైద్యుడు ఆమెకు మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేశాడు. 2021, 2023 మధ్య ఈ కుటుంబం రూ. 70 లక్షలు క్లెయిమ్ చేసింది. ఈ నిందితులు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, మ్యాక్స్ లైఫ్, భారతీ ఎఎక్స్‌ఎ, హెచ్‌డిఎఫ్‌సి, ఫ్యూచర్ జెనరాలి వంటి బీమా కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేసి తప్పుడు క్లెయిమ్‌లు చేసి సొమ్మును దొచుకున్నారు. అయితే ఆమెకు రెండు పేర్లతో బీమా చేయించారు. ఇలా రెండు సార్లు వేర్వేరు కంపెనీల్లో క్లెయిమ్ చేశారు.

మొత్తం రూ.70 లక్షలు క్లెయిమ్ చేసిన నిందితులు అదే విధంగా మరో బీమా పాలసీలో రూ.41 లక్షలకు క్లెయిమ్ సమర్పించారు. సమర్పించిన పత్రాలపై బీమా కంపెనీకి అనుమానం వచ్చింది. ఆ తర్వాత విచారణ చేసింది. వారి మునుపటి క్లెయిమ్‌ల వివరాలను తెప్పించుకుంది. రెండు క్లెయిమ్‌ల కోసం సమర్పించిన మరణ ధృవీకరణ పత్రాలను ఒకే వైద్యుడు జారీ చేశాడు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే ఆ పత్రాలన్నీ నకిలీవని తేలింది.

నాలుగు బీమా కంపెనీల ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 2021-2023 సంవత్సరాల మధ్య.. కంచన్ పాయ్, పవిత్ర పేరుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చూపించారు. ఇలా మహిళ రెండుసార్లు చనిపోయినట్టుగా చూపించి.. ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు క్లెయిమ్ చేశారు. మరో 40 లక్షలకు ప్లాన్ చేయగా దొరికిపోయారు.

WhatsApp channel