రూ.10 లక్షలకు భర్త కిడ్నీ అమ్మేసి.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
Wife Sale Husband Kidney : పశ్చిమ బెంగాల్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను బలవంతంగా కిడ్నీ అమ్మేలా చేసింది ఓ భార్య. తర్వాత ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి పరారైంది.
పశ్చిమబెంగాల్‌లో ఓ మహిళ తన భర్తను కిడ్నీ అమ్మాలని పట్టుబట్టింది. రూ.10 లక్షలకు బేరం కుదిరేలా చేసింది. ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన భర్త చివరకు ఆమె మాటలతో తన కిడ్నీని అమ్మేందుకు అంగీకరించాడు. అయితే కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బుతో భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్లో అరుదైన కేసు వెలుగుచూసింది. హౌరా జిల్లా సంక్రైల్‌కు చెందిన ఓ మహిళ తన భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. అయితే భర్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనితో పక్కా ప్రణాళిక వేసింది. కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది.
కుమార్తె చదువు, వివాహం కోసం డబ్బును ఇప్పటి నుంచే కూడబెట్టాలని చెప్పింది. దీంతో భర్త నిజమే కదా అని నమ్మేలా చేసింది. ఈ మేరకు భర్తకు మాయమాటలు చెప్పింది. మహిళ తన భర్తపై ఒత్తిడి తీసుకొచ్చింది. చివరకు కిడ్నీని అమ్మేందుకు భర్త అంగీకరించాడు. ఆ తర్వాత ఏడాది పాటు వెతికిన అనంతరం కిడ్నీ అవసరమైన వ్యక్తి దొరికాడు. తన కుమార్తెకు, కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని భావించిన భర్త కిడ్నీని విక్రయించాడు. తన భార్య తప్పుడు ఉద్దేశాలను అంచనా వేయలేకపోయాడు. కిడ్నీ అమ్మేయగా రూ.10 లక్షలు వచ్చాయి. ఈ డబ్బును తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది భార్య.
కిడ్నీ అమ్మి కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయాలనుకున్న భర్తకు షాక్ తగిలినట్టైంది. అతని భార్య భవిష్యత్తు కోసం వేరే ప్రణాళికలు చేసుకుంది. అయితే మహిళ వెళ్లిన ప్రియుడు కూడా ఫేస్‌బుక్‌లో పరిచమైన వ్యక్తి. బారక్‌పూర్‌కు చెందిన ఓ పెయింటర్‌గా తెలుస్తోంది. ఫేస్‌బుక్ పరిచయంతో ఇద్దరు దగ్గరయ్యారు. చివరకు భర్త కిడ్నీ అమ్మేసి భార్య వెళ్లిపోయింది.
భార్య వెళ్లిపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని గుర్తించారు. భర్త తన పదేళ్ల కుమార్తెతో కలిసి బారక్‌పూర్‌కు వెళ్లాడు. కానీ భార్య ఇంటి తలుపులు తెరిచేందుకు కూడా నిరాకరించింది. భర్తను బెదిరించి.. ఏం చేస్తావో చేసుకో అని చెప్పింది. అంతేకాదు.. త్వరలోనే విడాకులు ఇస్తానని తెలిపింది. భర్త కుటుంబ సభ్యులు, కూతురు వేడుకున్నా మహిళ మనసు కరగలేదు. వారితో మాట్లాడేందుకు కూడా ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు.