గ్రీస్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది! కాఫీ కప్పు ఫొటోలు చూసి 'నీ భర్తకు వివాహేతర సంబంధం ఉంది' అని చాట్‌జీపీటీ చెప్పడంతో సదరు మహిళ, తన భర్తకు విడాకులు ఇస్తోంది!
పురాతన కాలంలో టాస్సియోగ్రఫీ అనే పద్ధతితో భవిష్యత్తును ప్రెడిక్ట్ చేసేవారు. టీ ఆకుల పాటర్న్, తాగేసిన కాఫీ లేదా వైన్ కప్పుల్లో కనిపించే చిహ్నాల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగొచ్చు అనేది చెప్పేవారు.
ఇక ఇప్పుడు గ్రీస్‌కి చెందిన ఒక మహిళ.. చాట్‌జీపీటీలో ఈ టాస్సియోగ్రఫీని ప్రయత్నించింది. చాట్‌జీపీటీలో రెండు కాఫీ కప్పుల ఫొటోలను అప్లోడ్ చేసింది. 'నా భర్త కాఫీ కప్పును చూసి, అతనికి ఏదైనా అఫైర్ ఉందా?' అని చెప్పమంది.
ఆ కాఫీ కప్పు చూసిన చాట్‌జీపీటీ.. 'ఓ మహిళతో నీ భర్తకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె వల్ల నీ కుటుంబం చీలిపోతుంది,' అని బదులిచ్చిందట.
"'ఈ' అనే ఇనీషియల్ ఉన్న ఒక మహిళతో నీ భర్త గడుపుతాడు," అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.
చాట్‌జీపీటీ చెప్పడంతో 12ఏళ్ల వివాహ బంధంపై ఆ గ్రీస్ మహిళకు డౌట్లు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పి నిలదీసింది. ముందు అది విన్న ఆ వ్యక్తి నవ్వుకున్నాడు. ఇదేమీ పెద్ద సీరియస్ విషయం కాదనుకున్నాడు. కానీ కొన్ని రోజులకు భార్య నుంచి ఆయనకు విడాకుల నోటీసులు వచ్చాయి. అప్పుడే దీని తీవ్రతను అతను అర్థం చేసుకున్నాడు.
"ఇది నాన్సెన్స్ అనుకుని నవ్వుకున్నాను. కానీ నా భర్య దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. నన్ను వెళ్లిపోమంది. విడాకులు తీసుకుంటున్నట్టు పిల్లలకు చెప్పింది. ఆ తర్వాత లాయర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇది జోక్ కాదని, చాలా సీరియస్ విషయం అని అప్పుడే నాకు అర్థమైంది," అని ఓ స్థానిక టీవీ షోకు వెళ్లిన ఆ మహిళ భర్త చెప్పాడు.
అయితే, తన భార్య ఇలా ప్రవర్తించడం ఇది కొత్తేమీ కాదని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
"కొన్నేళ్ల క్రితం ఆమె ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లింది. అతను ఏదేదో చెప్పాడు. ఆమె నమ్మేసింది. అవన్నీ వట్టి మాటలే అని ఆమెకు అర్థం అవ్వడానికి ఏడాది కాలం పట్టింది," అని అన్నాడు.
ఈ విషయంపై ఆ మహిళ భర్త తరపున వాదిస్తున్న న్యాయవాది స్పందించాడు.
"చాట్‌జీపీటీలో కాఫీ రీడింగ్ ఫలితాలను చూసి వివాహేతర సంబంధం ఉందని చెప్పడం లీగల్‌గా చెల్లదు. నిజమైన ఆధారాలు బయటకు వచ్చేంత వరకు నా క్లైయింట్ అమాయకుడు," అని స్పష్టం చేశాడు.
ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకి ఎక్కింది. చాలా మంది మహిళ ప్రవర్తనకు షాక్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం.. ఆమె భర్తకు నిజంగా వివాహేతర సంబంధం ఉందా? లేదా? అనేది తెలుసుకునేందుకు కుతుహలం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం