జీవితం క్షణాల్లో మారిపోతుందనేందుకు మరొక ఉదాహరణ ఇది! ఒక మహిళ, ఆమె భర్తతో, తన ఇంటి మేడ మీద ఒక ఆహ్లాదకర సాయంత్రాన్ని గడుపుతోంది. ఇంతలో.. "నేను జారి పడిపోతే నన్ను పట్టుకుంటావా?" అని అడిగింది. అక్కడి నుంచి కొన్ని క్షణాలకే, ఆ మహిళ టెర్రెస్ మీద నుంచి జారి కిందపడి ప్రాణాలు కోల్పోయింది.
ఒడశాకు చెందిన బోరింగి పార్వతి, డీ దుర్యోధన్ రావ్‌లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేస్ 3లోని ఒక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు.
కాగా గత మంగళవారం వారిద్దరు కలిసి భవనం మేడ మీదకు వెళ్లారు. కొంతసేపు ఆహ్లాదకర సమయం గడిపారు. ఆ తర్వాత ఆ మహిళ, తన భర్తను ఆటపట్టించడం మొదలుపెట్టింది. టెర్రెస్ ఎక్కి, ప్రమాదకరంగా కూర్చుంది.
"నేను పడిపోతే, నువ్వు నన్ను కాపాడతావా?" అని ఆ మహిళ, తన భర్తను అడిగింది. "కిందకి దిగు" అని భర్త ఎంత చెప్పినా ఆమె వినకపోగా.. కొన్ని క్షణాలకు అటువైపునకు కాస్త ఒంగింది. భర్త ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె పై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది!
"కిందకి దిగమని నేను చెబుతూనే ఉన్నాను. కానీ ఆమె జారి కిందపడిపోయింది. అప్పటికీ నెను రెండు నిమిషాల పాటు ఆమె చేతులను పట్టుకున్నాను. సాయం కోసం అరిచాను. కానీ చుట్టుపక్కన ఎవరూ లేరు. నా చేతుల్లో నుంచి స్లిప్ అయిపోయి కిందపడిపోయింది. నేల మీద పడటంతో బలంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాము. కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. నేను విషాదంలో ఉన్నాను," అని మహిళ భర్త చెప్పాడు.
"ఇది నా దురదృష్టం. మేము చాలా సంతోషకరంగా జీవిస్తున్నాము. ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము. పిల్లల్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. కానీ నా కలలన్నీ నాశనం అయిపోయాయి. ఇలా జరగాలని దేవుడు రాసినట్టున్నాడు," అని మహిళ భర్త రావ్ తెలిపాడు.
ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తన భార్యను కావాలనే భవనం మీద నుంచి తోసేసి, ఆ వ్యక్తి కట్టు కథలు చెబుతున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఏం లేదని తేల్చారు.
"మహిళ భర్త ఒంటికి గాయాలున్నాయి. మహిళను కాపాడే క్రమంలో గాయాలైనట్టు తెలుస్తోంది. పార్వతి కుటుంబం కూడా రావ్‌కి వ్యతిరేకంగా ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించాము," అని ఓ పోలీసు అధికారి వివరించారు.
సంబంధిత కథనం