Crime News: మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం; ఆ పై దోపిడీ
Crime News: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయి. తాజాగా, బిహార్ కు చెందిన ఒక యువతికి మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడో ఈ- రిక్షా డ్రైవర్. ఆ పై ఆ మహిళ వద్ద ఉన్న డబ్బును, మొబైల్ ఫోన్ ను తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Crime News: ఢిల్లీలో మే 26వ తేదీన ఓ ఈ-రిక్షా డ్రైవర్ 25 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి దోచుకున్నాడు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ ఉమర్ ను పోలీసులు ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో అరెస్టు చేశారు.
పక్కనే మూడేళ్ల కుమారుడు..
మే 26న కొటాలి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించి పీసీఆర్ కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపించారు. అపస్మారక స్థితిలో ఉన్న తీవ్రంగా రక్తస్రావం అవుతున్న ఓ మహిళను అక్కడ గుర్తించారు. ఆమె పక్కనే మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పోలీసులు వెంటనే ఆ మహిళను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు.
మత్తు మందు ఇచ్చి..
ఆ మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 150 మంది రిక్షా యజమానులను విచారించారు. సమీప ప్రాంతాల్లోని 500 సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. చివరకు నిందితుడిని గుర్తించారు. నిందితుడు మహ్మద్ ఉమర్ ను మే 29న ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి భర్తను కలిసేందుకు బీహార్ నుంచి పంజాబ్ కు వెళ్తోంది. మే 26న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ రైలు దిగి సదర్ మార్కెట్ కు వెళ్లింది. ఈ-రిక్షా ద్వారా స్టేషన్ కు తిరిగి వస్తుండగా డ్రైవర్ ఆమెకు ఒక డ్రింక్ ఆఫర్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది.
నిర్మానుష్య ప్రాంతానికి..
అనంతరం ఆ ఈ- రిక్షా డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికి ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా, ఆమె తలపై ఇటుకతో బలంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత, ఆమె వద్ద ఉన్న రూ. 3 వేల నగదును, మొబైల్ ఫోన్ ను తీసుకుని పారిపోయాడు. నిందితుడు ఉమర్ గతంలో ఓ దొంగతనం కేసులో కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిపై ఐపీసీ 376, 308, 328, 379 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.