మహిళ కడుపులో 9 ఇంచుల పైపు.. ఆరేడు నెలల తర్వాత తెలిసిన విషయం.. వైద్యులపై కేసు!-woman claims 9 inch pipe left in her abdomen at noida hospital complaint on doctors know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మహిళ కడుపులో 9 ఇంచుల పైపు.. ఆరేడు నెలల తర్వాత తెలిసిన విషయం.. వైద్యులపై కేసు!

మహిళ కడుపులో 9 ఇంచుల పైపు.. ఆరేడు నెలల తర్వాత తెలిసిన విషయం.. వైద్యులపై కేసు!

Anand Sai HT Telugu
Nov 09, 2024 06:58 AM IST

Noida News : తన కడుపులో 9 ఇంచుల పైపును ఉందని వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ . శస్త్ర చికిత్స చేసిన సమయంలో అలానే ఉంచేశారని తెలిపింది. మరోవైపు ఇది తమ తప్పు కాదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStockphoto)

ఓ మహిళ తన కడుపులో 9 ఇంచుల పైపు ఉందని వైద్యులకు ఫిర్యాదు చేసింది. 2023లో నిర్వహించిన శస్త్రచికిత్సలో తన పొత్తికడుపులో 9.05 అంగుళాలు పొడవాటి పైపును వదిలిపెట్టారని పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఈ మహిళ నోయిడాలోని సెక్టార్ 51లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై వైద్యపరమైన నిర్లక్ష్యం కింద ఫిర్యాదు చేసింది. ఇటీవలి శస్త్రచికిత్సలో పైపు ఉందని కనుగొన్నట్లు పేర్కొంది.

కిరణ్ నేగి అనే మహిళ బుధవారం దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సెక్టార్ 49 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విషయంలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. అయితే ఆమె పరిస్థితి నిలకడగా ఉన్న సమయంలోనే డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రిలోని సీనియర్ అధికారి ఒకరు ఆరోపణలను ఖండించారు.

ఫిబ్రవరి 2023లో హాస్పిటల్‌లో గర్భాశయంలో పెరిగే కణితుల తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్నారు కిరణ్ నేగి. ఆమెకు నిరంతరం కడుపు నొప్పి వచ్చేదని నేగి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లిన చూపించినా.. పరిస్థితి మెరుగుపడలేదు. ఆరు నుండి ఏడు నెలల తర్వాత ఆమె సెక్టార్ 19లోని వేరే ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ మరొక శస్త్రచికిత్స జరిగింది. ఈ ప్రక్రియలో వైద్యులు ఆమె పొత్తికడుపు నుండి 9.05 అంగుళాల పొడవు గల పైపును కనుగొని తొలగించినట్లు అధికారులు తెలిపారు.

ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. మెుదటి శస్త్రచికిత్సన విజయవంతమైంది. కానీ శస్త్రచికిత్స తర్వాత ఒక సమస్య తలెత్తింది. ఆమె కడుపునకు పెట్టిన డ్రైనేజ్ బ్యాగ్‌ను ఆసుపత్రి సిబ్బంది ఖాళీ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది తొలగిపోయిందని బాధితురాలు చెబుతోంది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది ఆమెకు భరోసా ఇచ్చారని పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేశారు.

డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు కడుపునొప్పి మొదలైందని నేగి తన ఫిర్యాదులో వివరించింది. ఆమె తరువాత ఆరు నుండి ఏడు నెలల పాటు ఆసుపత్రి వైద్యులను అనేకసార్లు కలిసింది. అక్టోబర్ 2023లో మరొక ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకుంది.

శస్త్రచికిత్స సమయంలో ఆమె పొత్తికడుపులో మిగిలిపోయిన 9.05 అంగుళాల పొడవైన పైపును వైద్యులు కనుగొన్నారు. దానిని తొలగించేందుకు మరో శస్త్రచికిత్స జరిగింది. దీంతో మహిళ మెుదటి శస్త్ర చికిత్స చేసిన వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు వైద్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఈ ఘటనపై మెుదటి శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడారు. 'రోగి ఆసుపత్రి నుండి సరైన స్థితిలో డిశ్చార్జ్ అయ్యారు, ఆమె తన డ్రెయిన్ పైపును ఎక్కడో పగలగొట్టింది. ఆసుపత్రిని బెదిరించడం ప్రారంభించింది. పరిహారం ఇవ్వాలని కోరింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత మా నివేదికను సమర్పించమని అడిగారు. ఆసుపత్రిలో భాగంగా ఎటువంటి తప్పు జరగలేదు.' అని సీనియర్ అధికారి వెల్లడించారు.

Whats_app_banner