Maharashtra: కారును రివర్స్ చేస్తూ 300 అడుగుల లోతైన లోయలో పడి యువతి మృతి
ఒక లోతైన లోయ అంచున కారును రివర్స్ చేస్తూ, ప్రమాదవశాత్తూ, ఆ లోయలో పడిపోయి 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో చోటుచేసుకుంది. కారును రివర్స్ చేస్తుండగా, కన్ఫ్యూజన్ లో యాక్సిలరేటర్ ను బలంగా నొక్కి లోతైన లోయలో పడిపోయింది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జూన్ 17 సోమవారం 23 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆమె కారు రివర్స్ గేర్ లో ఉండగా ప్రమాదవశాత్తు యాక్సిలరేటర్ నొక్కడంతో వాహనం లోయలో పడిపోయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
బ్రేక్ బదులుగా యాక్సిలరేటర్ నొక్కి..
మధ్యాహ్నం సులిభంజన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, ఆ మహిళను శ్వేతా సుర్వాసేగా గుర్తించామని ఖుతాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. తన స్నేహితుడు శివరాజ్ ములే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సుర్వాసే డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నించింది. కారు రివర్స్ గేర్ లో ఉండగా ఆమె బ్రేక్ వేయబోయి, కన్ఫ్యూజన్ లో యాక్సిలరేటర్ ను గట్టిగా నొక్కింది. దాంతో వాహనం వేగంగా వెనక్కు వెళ్లి, క్రాష్ బారియర్ ను బద్దలు కొట్టుకుని లోయలో పడిపోయింది. రెస్క్యూ సిబ్బంది ఆమెను, వాహనాన్ని చేరుకోవడానికి గంట సమయం పట్టింది. సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది.
వీడియో వైరల్
ఈ ప్రమాదం జరుగుతుండగా, ఆమె స్నేహితుడు తీసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పలువురు షేర్ చేశారు. ఇందులో మొదట సుర్వాసే నెమ్మదిగా కారు నడపడం కనిపిస్తుంది. ఆమె రివర్స్ చేస్తున్నప్పుడు, ఆమె లోయ అంచుకు చేరుకున్నట్లు గుర్తించదు. ఈ వీడియోను రికార్డ్ చేస్తున్న ఆమె స్నేహితుడు కారును బ్రేక్ వేసి ఆపాలని హెచ్చరిస్తాడు. కానీ, సుర్వాసే బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్ ను నొక్కడంతో, కారు వేగం పెరిగి, రివర్స్ లోనే లోయలో పడిపోయింది.
మరో ఘటనలో మరో యువతి
కాట్రాజ్ వద్ద శనివారం 25 ఏళ్ల పుణె యువతి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు కింద పడి మృతి చెందింది. శ్వేతా చంద్రకాంత్ లిమ్కర్ అనే మహిళ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె పుణె వైపు వెళ్తుండగా రెండు ఆర్టీసీ బస్సుల మధ్యలోకి వెళ్లింది. అక్కడ బ్యాలెన్స్ తప్పడంతో, ఒక బస్సు వెనుక చక్రాల కింద పడిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె హెల్మెట్ ధరించినప్పటికీ, అది ఆమెను కాపాడలేకపోయింది. కింద పడగానే ఆమె ధరించిన హెల్మెట్ పడిపోయిందని, దాంతో, బస్సు వెనుక చక్రం కింద ఆమె తల నలిగిపోయిందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ససూన్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.