ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ వైమానిక దళ సిబ్బందితో మమేకమయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆదంపూర్ లోని ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ నేపథ్యంలో సైనికులకు సెల్యూట్ చేస్తూ దిగిన ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేశారు.
పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. అయితే, తాము చేసిన దాడుల్లో భారత్ లోని ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం అయిందని పాకిస్తాన్ ప్రచారం చేపట్టింది. పాకిస్థాన్ కు చెందిన జేఎఫ్ -17 జెట్ల నుంచి ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణులు ఆదంపూర్ లోని ఎస్ -400 వ్యవస్థను ధ్వంసం చేశాయని పాక్, చైనాలు ప్రచారం చేశాయి. అయితే, అది వాస్తవం కాదని, పాకిస్తాన్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆ విషయాన్ని స్పష్టమైన ఆధారాలతో తోసిపుచ్చారు. ఇప్పుడు తాజాగా, ఎస్ 400 గనతల రక్షణ వ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో ప్రధాని మోదీ స్వయంగా ఫొటో దిగి పాక్ అబద్ధాలకు చెక్ పెట్టారు.
ఆదంపూర్ వైమానిక స్థావరంలో దిగిన ఫోటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ, "ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులను" కలుసుకున్నానని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ నిర్ణయాత్మక విజయం సాధించిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వైమానిక దళ యోధులు, సైనికులతో సంభాషించడంతో ఆదంపూర్ స్థావరంలో వాతావరణం 'భారత్ మాతాకీ జై', 'వందేమాతరం' నినాదాలతో నిండిపోయింది. 'ఈ రోజు ఉదయం నేను ఏఎఫ్ఎస్ అదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులను కలిశాను. ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం, నిర్భయతకు ప్రతీకగా నిలిచే వారితో కలిసి ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’’ అని మోదీ తన సోషల్ మీడియా పోస్ట్ లో రాశారు.
ఈ పర్యటనలో భాగంగా భారత వైమానిక దళ సిబ్బంది స్థావరంలో పరిస్థితులు, పరిణామాలను ప్రధాని మోదీకి అక్కడి అధికారులు వివరించారు. అంతకు ఒక రోజు ముందే, ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి, ఉగ్రవాద సూత్రధారులకు మధ్య తేడాను భారత్ గుర్తించదు. వారిద్దరూ మాకు సమానమే' అని మోదీ ఆ ప్రసంగంలో తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా "పాకిస్తాన్ కు ఫ్యాక్ట్ చెక్" అనే కామెంట్ తో అదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
సంబంధిత కథనం