BJP News | బీజేపీలో సంస్థాగ‌త మార్పులు; రానున్న ఎన్నిక‌ల కోస‌మేనా..?-with new appointments bjp rss begin poll preparations ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  With New Appointments, Bjp- Rss Begin Poll Preparations

BJP News | బీజేపీలో సంస్థాగ‌త మార్పులు; రానున్న ఎన్నిక‌ల కోస‌మేనా..?

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 07:36 PM IST

BJP News | 2023లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో పోల్ ప్రిప‌రేష‌న్‌ను ఆరెస్సెస్‌, బీజేపీలు ప్రారంభించాయి. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ, సంస్థాగ‌త మార్పులకు శ్రీకారం చుట్టాయి.

బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ మంత్రి శ్రీనివాసులు
బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ మంత్రి శ్రీనివాసులు

BJP News | రానున్న ఎన్నిక‌ల‌కు శ్రేణుల‌ను సిద్ధం చేయ‌డానికి తెలంగాణ స‌హా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగ‌త బ‌దిలీల‌ను బీజేపీ ప్రారంభించింది. ఎన్నిక‌ల‌కు సిద్దం కావ‌డంతో పాటు ఆయా రాష్ట్రాల్లో సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావ‌డం ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

BJP News | పంజాబ్‌కు మంత్రి శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (organisation)గా ఉన్న సీనియ‌ర్ లీడ‌ర్ మంత్రి శ్రీనివాసులును పంజాబ్‌కు బ‌దిలీ చేసింది. తెలంగాణ‌లోనూ 2023లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంది. బీజేపీ, ఆరెస్సెస్‌ల మ‌ధ్య స‌మ‌తౌల్యం సాధించ‌డం, ఇరు వ‌ర్గాల మ‌ధ్య విబేధాల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో శ్రీనివాసులుకు అపార అనుభ‌వం ఉంది. రాజ‌కీయాల‌ను, సైద్ధాంతిక అంశాల‌ను స‌మ‌న్వ‌య ప‌ర్చ‌డంలో ఆయ‌న ఎక్స్‌ప‌ర్ట్‌. తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల నుంచి సీనియ‌ర్ నేత‌ల‌ను బీజేపీలోకి తీసుకురావ‌డంలో ఆయ‌న కీల‌క భూమిక నిర్వ‌ర్తించారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకురాలు డీకే అరుణ‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌దితురులు బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం వెనుక శ్రీనివాసులు కృషి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు గట్టిగా న‌మ్ముతున్నాయి.

BJP News | బండి సంజ‌య్‌తో విబేధాలు!

అయితే, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీనివాసులుతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు విబేధాలున్నాయ‌నే వార్త కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఆ కార‌ణంగానే శ్రీనివాసులును పంజాబ్‌కు పంపిస్తున్నార‌ని ఆరెస్సెస్‌లోని కొన్ని వ‌ర్గాలు విశ్వ‌సిస్తున్నాయి. మరోవైపు, పంజాబ్‌లో బీజేపీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసే పెద్ద బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించ‌డం కోసమే ఆయ‌న‌ను అక్క‌డికి పంపిస్తున్నార‌ని కొంద‌రు నేత‌లు వాదిస్తున్నారు. శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో తెగతెంపుల అనంత‌రం పార్టీని అధికారం దిశ‌గా తీసుకువెళ్లాలంటే శ్రీనివాసులు వంటి సీనియ‌ర్ అవ‌స‌రం ఉంద‌ని అధిష్టానం భావించింద‌ని వారి వాద‌న‌.

BJP News | క‌ర్నాట‌క‌కు జీవీ రాజేశ్‌..

క‌ర్నాట‌క బీజేపీ వ్య‌వ‌హారాలు చూస్తున్న అరుణ్ కుమార్‌ను తిరిగి మాతృసంస్థ ఆరెస్సెస్‌కు పంపించేశారు. ఆయ‌న స్థానంలో జీవీ రాజేశ్‌ను నియ‌మించారు. క‌ర్నాట‌క‌లో కూడా వ‌చ్చే సంవ‌త్స‌రం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ద‌క్షిణ క‌న్న‌డ రాజ‌కీయాల‌పై రాజేశ్‌కు గట్టి ప‌ట్టు ఉంది. అక్క‌డ ఆయ‌న 2010 నుంచి ఫుల్‌టైమ్ వాలంటీర్‌గా ఉన్నారు. అరుణ్ కుమార్ క‌న్నా జూనియ‌రే అయినా, యువ‌త‌తో రాజేశ్‌కు మంచి సంబంధాలున్నాయి. మ‌రోవైపు, క‌ర్నాట‌క బీజేపీలో అంత‌ర్గ‌త విబేధాలు క్ర‌మంగా పెద్ద‌వ‌వుతున్నాయి. వాటిని ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త కూడా రాజేష్‌పై ఉంది.

BJP News | మ‌ధ్య క్షేత్ర‌కు అజ‌య్‌..

ఈశాన్య ప్రాంతాల వ్య‌వ‌హారాలు చూస్తున్న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(organisation) అజ‌య్ జ‌మ్వాల్ ను సంస్థాగ‌త‌ వ్య‌వ‌హారాలు చూడ‌డానికి `మ‌ధ్యక్షేత్ర‌(central region) `కు బ‌దిలీ చేశారు. ఈ సెంట్ర‌ల్ రీజియ‌న్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ ఉంటాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 2023లో ఎన్నిక‌లు ఉన్నాయి. అందువ‌ల్ల శ్రేణుల బ‌లోపేతానికి ఆయ‌న కృషి చేయ‌నున్నారు. చ‌త్తీస్‌గ‌ఢ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోయింది. అప్ప‌టినుంచి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఇటీవ‌ల కేబినెట్ మంత్రి స్వ‌యంగా సీఎం భూపేశ్ బ‌ఘేల్‌పై విమ‌ర్శ‌లు చేశారు. మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం ఎన్నిక‌లు ఉండ‌డంతో, ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావించిన అనుభ‌వ‌జ్ఞుడైన అజ‌య్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు, బీజేపీ రాష్ట్ర నేత‌ల్లో నెల‌కొన్న విబేధాల‌ను తొల‌గించే బాధ్య‌త‌ల‌ను కూడా అధిష్టానం అయ‌న‌కు అప్ప‌గించింది.

IPL_Entry_Point