Winter delayed: ఇంకా కనిపించని శీతాకాలం! 123ఏళ్లల్లోనే అతి వెచ్చని అక్టోబర్- ఎందుకు ఈ పరిస్థితి?
Winter in India : భారతదేశం 123 సంవత్సరాలలో అత్యంత వెచ్చని అక్టోబర్ తాజాగా నమోదైంది! ఫలితంగా నవంబర్ వచ్చినా, ఇంకా శీతాకాలం ప్రభావం కనిపించడం లేదు. పైగా ఈసారి భారీ వర్షాలు కూడా కురుస్తాయని సమాచారం.
ఉత్తర భారత దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికి ఉత్తర భారతంలో శీతాకాలం ప్రారంభమవ్వాలి. కానీ ఇప్పటికీ, వింటర్ జాడ లేదు! పైగా.. అక్టోబర్‌లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 123ఏళ్లల్లోనే అత్యంత వెచ్చని అక్టోబర్ ఈసారి నమోదైంది.
మరోవైపు నవంబర్‌లో వర్షాలు చాలా అరుదుగా పడుతుంటాయి. కానీ ఈసారి దేశంలోని అనేక ప్రాంతాల్లో నవంబర్ నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా ఈ నవంబర్.. అత్యంత తడి నెలగా కూడా ఉంటుందని తెలుస్తోంది.
నాలుగు అల్పపీడన వ్యవస్థలు, ఉష్ణోగ్రతలను నియంత్రించగల పాశ్చాత్య అవాంతరాలు లేకపోవడం వంటివి, అక్టోబర్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు దోహదం చేశాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
“అక్టోబర్‌లో సగటు ఉష్ణోగ్రత 26.92 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది 1901 తరువాత అత్యంత వెచ్చగా ఉంది! సాధారణ ఉష్ణోగ్రత 25.69° సెంటీగ్రేడ్. దేశ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 20.01 డిగ్రీలకు గాను 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా పశ్చిమ గాలులు, తూర్పు గాలులు వీచకపోవడమే వెచ్చని వాతావరణానికి కారణము,” అని మహాపాత్ర పేర్కొన్నారు.
విస్తృతమైన దీపావళి వేడుకల మధ్య దేశంలోని అనేక ప్రాంతాలు గత కొన్ని రోజులుగా కాలుష్య స్థాయిలు పెరిగాయి. ప్రజలు స్థానిక బాణసంచా నిషేధాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఇది వాతావరణంపై మరింత ప్రతికూల పరిస్థితిని చూపిస్తోంది.
నవంబర్ 3 నుంచి 7 వరకు వాయవ్య, తూర్పు భారతంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే వారం రోజుల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వాతావరణ మార్పులు ఉండవని అంచనా వేశారు.
ఈ నవంబర్‌లో వాయవ్య భారతం, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతుండటం కూడా శీతల వాతావరణ పరిస్థితుల ప్రారంభంలో జాప్యానికి కారణం కావచ్చు. నవంబర్-డిసెంబర్ నెలల్లో లా నినా పరిస్థితులు క్రమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో మోస్తరు వర్షాలు..
గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు, దానిని అనుకొని ఉన్న శ్రీలంక తీరాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం