ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ రాబోయే రోజుల్లో కూడా పాకిస్థాన్‌పై భారత్ నిఘా ఉంచుతుందని అన్నారు. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఉంటుందన్నారు. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే గుణపాఠం నేర్పిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అణ్వాయుధాల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడాన్ని భారతదేశం సహించదని అన్నారు.
'ఖచ్చితంగా ఇది యుద్ధ యుగం కాదు, అలాగే ఉగ్రవాద యుగం కూడా కాదు. పాకిస్థాన్ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ భారతదేశం పాకిస్థాన్ ఛాతీపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయమైన చర్య.' అని ప్రధాని మోదీ అన్నారు.
నేటి పరిస్థితిలో ప్రపంచం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఉగ్రవాదాన్ని కూడా కోరుకోవడం లేదన్నారు మోదీ. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. పాకిస్థాన్ గుణం ఏంటో బహిర్గతమైందన్నారు. మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఐఎస్ఐ, పాకిస్థాన్ ఆర్మీ అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదాన్ని సహించదని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.
'పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదంపైనే ఉంటుంది, అది పీఓకే గురించే. ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవు, నీరు, రక్తం కూడా కలిసి ప్రవహించలేవు.' అని మోదీ వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సింధూర్‌లో భారత దళాల పరాక్రమానికి ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదంపైనే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. మొదటి మూడు రోజుల్లోనే, భారతదేశం ఊహించని స్థాయిలో పాకిస్థాన్‌ను నాశనం చేసిందన్నారు. భారతదేశం దూకుడు చర్య తర్వాత పాకిస్థాన్ తప్పించుకోవడానికి మార్గాలను వెతకడం ప్రారంభించిందన్నారు. ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తోందన్నారు. అందుకే మే 10 మధ్యాహ్నం పాకిస్థాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించిందని చెప్పారు.