పహల్గామ్​ ఉగ్రదాడి : నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్- ఎన్​సీడబ్ల్యూ సీరియస్​..-wife of navy officer killed in pahalgam attack trolled womens panel steps in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పహల్గామ్​ ఉగ్రదాడి : నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్- ఎన్​సీడబ్ల్యూ సీరియస్​..

పహల్గామ్​ ఉగ్రదాడి : నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్- ఎన్​సీడబ్ల్యూ సీరియస్​..

Sharath Chitturi HT Telugu

పహల్గామ్​ ఉగ్రదాడి మృతుడు వినయ్​ నర్వాల్​ భార్య హిమాన్షికి ఎన్​సీడబ్ల్యూ మద్దతుగా నిలిచింది. ముస్లింలు, కశ్మీరీలను ద్వేషించవద్దని ఆమె చేసిన వ్యాఖ్యలపై వస్తున్న ట్రోలింగ్​ని తప్పుబట్టింది.

హిమాన్షి నర్వాల్​ (PTI)

పహల్గామ్​ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్​ నర్వాల్​ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినయ్​ నర్వాల్​ భార్య హిమాన్షిపై సోషల్​ మీడియాలో విపరీతమైన ట్రోల్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలు, కశ్మీరీలను ద్వేషించొద్దు అని ఆమె చెప్పడం ఇందుకు కారణం. ఆన్​లైన్​ ట్రోలింగ్​ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్​ హిమాన్షికి మద్దతుగా నిలిచింది. తన సిద్ధాంతాలను వ్యక్తపరిచిన ఒక మహిళను ట్రోల్ చేయడం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది.

పహల్గామ్​ ఉగ్రదాడి బాధితురాలు..

ఏప్రిల్ 22న కశ్మీర్​లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్​లో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడికి వారం రోజుల ముందు వినయ్ నర్వాల్- హిమాన్షి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ హనీమూన్​కు కశ్మీర్​ వెల్లగా.. ఉగ్రవాదులు నేవీ అధికారిపై కాల్పులు జరిపి చంపేశారు.

అనంతరం దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. ఉగ్రవాదులను, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్​పై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ప్రభుత్వానికి సర్వత్రా విజ్ఞప్తులు అందుతున్నాయి.

కాగా ఉగ్రదాడి విషయంలో ఒక వర్గాన్ని టార్గెట్​ చేయడం సరికాదని హిమాన్షి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపైనే గత గురువారం భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.

“వినయ్ ఎక్కడున్నా ఆయన ప్రశాంతంగా ఉండాలని యావత్ దేశం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. నాకు కావాల్సింది అదొక్కటే. అయితే ఎవరిపైనా ద్వేషం ఉండకూడదు. ముస్లింలు లేదా కశ్మీరీలపై ప్రజలు ద్వేషాన్ని చిమ్మడం నేను చూస్తున్నాను. ఇది మనకు అక్కర్లేదు. మనకు శాంతి కావాలి. శాంతి మాత్రమే కావాలి,” అని నేవీ ఆఫీసర్​ భార్య హిమాన్షి అన్నారు.

'దురదృష్టకరం..'

హిమాన్షి వ్యాఖ్యల నేపథ్యంలో నేవీ అధికారి భార్యపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది.

ఈ ట్రోలింగ్​ను గమనించిన ఎన్​సీడబ్ల్యూ ఈ చర్యను ఖండించింది. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత ఆయన భార్య హిమాన్షి నర్వాల్​ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన తీరు అత్యంత గర్హనీయమని, దురదృష్టకరమని పేర్కొంది.

ఒక మహిళను ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణ లేదా వ్యక్తిగత జీవితం ఆధారంగా ట్రోల్ చేయడం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.

ఏదైనా అంగీకారం లేదా అసమ్మతిని వ్యక్తం చేయడం ఎల్లప్పుడూ "మర్యాదతో- రాజ్యాంగ హక్కులకు లోబడి" జరగాలని ప్యానెల్ సూచించింది. ప్రతి మహిళ గౌరవాన్ని కాపాడేందుకు జాతీయ మహిళా కమిషన్ కట్టుబడి ఉంది వివరించింది.

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడిలో పలువురు పౌరులు మరణించడంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) విచారం వ్యక్తం చేసింది. వినయ్ నర్వాల్​తో పాటు ఇతరులను మతం గురించి అడిగి మరీ కాల్చడం అత్యంత దారుణమైన విషయం అని పేర్కొంది.

ఈ ఉగ్రదాడితో యావత్ దేశం బాధపడుతోందని ఎన్​సీడబ్ల్యూ వెల్లడిచింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.