US study: అమెరికాలో హైయర్ స్టడీస్ అంటే మనవారికి ఎందుకు అంత ఆసక్తి? యూఎస్ స్టడీతో లాభాలేంటి?
US study: విదేశాల్లో ఉన్నత విద్య అంటే ముందుగా భారతీయులకు గుర్తుకు వచ్చేది అమెరికానే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో యూఎస్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
US study: అమెరికా లో ఉన్నత విద్య అభ్యసించడం ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక కల. ఆ కలను సడలించిన అమెరికా వీసా నిబంధనలు ఈజీగానే సాకారం చేస్తున్నాయి. గత విద్యాసంవత్సరంలో భారత్ నుంచి 13 లక్షల మంది విద్యార్థులు హైయర్ స్టడీస్ కు విదేశాలకు వెళ్తే, అందులో దాదాపు 4.65 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో.. అసలు అమెరికా విద్యకు ఎందుకంత క్రేజ్?.. అమెరికాలో చదవడం వల్ల అదనంగా ఒనగూరే లాభాలేంటి? .. మిగతా దేశాల కన్నా యూఎస్ నే ఎందుకు ఉన్నత విద్యకు ఎంచుకోవాలి?.. తెలుసుకుందాం..
భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే అడ్వాన్స్డ్ కోర్సులు
అమెరికా యూనివర్సిటీలు (US Universities) ఎప్పటికప్పుడు, డైనమిక్ గా తమ కోర్స్ కంటెంట్ ను మారుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ అవసరాలను గమనిస్తూ, తదనుగుణంగా కరిక్యులమ్ లో మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన స్టెమ్ (STEM) కోర్సుల నుంచి.. లిబరల్ ఆర్ట్స్ కోర్సుల వరకు యూఎస్ వర్సిటీల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సుల్లో మరింత ఉన్నత చదువులకు వెళ్లడానికి కూడా వర్సిటీలు సహకరిస్తాయి.
నాణ్యమైన విద్య
యూఎస్ వర్సిటీల్లో విద్యానాణ్యత విషయంలో ఎలాంటి లోటు ఉండదు. అత్యంత నాణ్యమైన విద్య (US study) ను అందిస్తాయి. కోర్సు కరిక్యులమ్ కూడా విద్యార్థులను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ లను చేసేలా ఉంటుంది. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అత్యధికం అమెరికాలోనే ఉంటాయి. ప్రపంచంలోని టాప్ 25 వర్సిటీల్లో 16 యూఎస్ లోనే ఉన్నాయి. రీసెర్చ్, అండ్ డెవలప్ మెంట్ కోసం యూఎస్ వర్సిటీలు భారీగా బడ్జెట్ లను కేటాయిస్తాయి.
ఇంటర్నేషనల్ నెట్ వర్క్
అమెరికాలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వివిధ దేశాల విద్యార్థులతో పరిచయం, వారితో కలిసి చదువుకోవడం, కలిసి పని చేయడం భారతీయ విద్యార్థుల భవిష్యత్ విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం వల్ల వారిలో విశాల దృక్పథం పెరుగుతుంది.
ఉపాధి అవకాశాలు..
అమెరికాలో విద్యను అభ్యసించడానికి వెళ్లే విద్యార్థులకు అమెరికాలోని సులువైన పని విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. యూఎస్ లోని పోస్ట్ గ్రాడ్ వర్క్ ఆపర్చునిటీస్ ప్రపంచంలోనే బెస్ట్ అనవచ్చు.యూఎస్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (Optional Practical Training OPT) విద్యార్థులకు ఇండస్ట్రీలో తమ స్కిల్స్ ను పరీక్షించుకోవడానికి, భవిష్యత్తు పని సంస్కృతిని తెలుసుకోవడానికి, కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడానికి, నాలెడ్జ్ ను అప్ గ్రేడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వీసా పాలసీ
స్టుడెంట్ వీసా (F-1) లకు సంబంధించినంత వరకు అమెరికా వీసా పాలసీ చాలా స్టుడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ముఖ్యంగా, భారతీయ విద్యార్థుల విషయంలో యూఎస్ చాలా లిబరల్ గా వీసాలను జారీ చేస్తుంది. స్టుడెంట్ వీసా లకు సంబంధించి అమెరికా ఇటీవల తమ విధి విధానాలను చాలా సులభతరం చేసింది. విదేశీ విద్యార్థులు అమెరికా విద్యా విధానంపై, ఆర్థిక వ్యవస్థపై చూపే సానుకూల ప్రభావాన్ని అర్థం చేసుకున్న అమెరికా.. పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు అమెరికా రావడాన్ని ప్రోత్సహిస్తోంది.