గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే వాహనదారులు రూ.150 టోల్ ఎందుకు చెల్లించాలి : సుప్రీంకోర్టు-why should commuter pay 150 rupees toll fee if stuck in traffic jam for hours asks supreme court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే వాహనదారులు రూ.150 టోల్ ఎందుకు చెల్లించాలి : సుప్రీంకోర్టు

గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే వాహనదారులు రూ.150 టోల్ ఎందుకు చెల్లించాలి : సుప్రీంకోర్టు

Anand Sai HT Telugu

టోల్ ఫీజుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనదారులు గంటలతరబడి ట్రాఫిక్ జామ్‌లో ఉంటే టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది.

సుప్రీం కోర్టు

కేరళలోని త్రిస్సూర్‌లో 65 కిలోమీటర్ల హైవేను కవర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకుంటే వాహనదారుడు రూ.150 టోల్ చెల్లించాలని ఎందుకు అడగాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. త్రిస్సూర్‌లోని పాలియెక్కర టోల్ ప్లాజా వద్ద టోల్ వసూళ్లను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, కన్సెషనర్ గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

కాస్త దూరానికి వెళ్లడానికి 12 గంటల సమయం పడుతుంటే రూ.150 ఎందుకు చెల్లించాలి? అని సుప్రీం కోర్టు అడిగింది. గంట సమయం పట్టే దారికి.. మరో 11 గంటల సమయం పడుతుందని వ్యాఖ్యలు చేసింది. టోల్ ఎందుకు చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు. వారాంతంలో ఈ మార్గంలో దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిన విషయాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం ముంగుకు వచ్చింది.

544వ నెంబరు జాతీయ రహదారి ఎడప్పాడి-మన్నూతి మార్గంలో రోడ్డు అధ్వానంగా ఉండటం, కొనసాగుతున్న పనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో ఆగస్టు 6న టోల్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, రాయితీదారు తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.

ఎడప్పాడి, మన్నూత్తి మధ్య చాలా చోట్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో, ఈ జాతీయ రహదారిపై ఒక గంటలో ప్రయాణించాల్సిన దూరాన్ని కవర్ చేయడానికి 12 గంటల వరకు పడుతుంది. దీని కారణంగా టోల్ ఫీజులు వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తూ కేరళ హైకోర్టులో కేసు దాఖలైంది.

ఈ కేసులో కేరళ హైకోర్టు టోల్ వసూలుపై స్టే విధించింది. దీనిపై ఎన్‌హెచ్ఏఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేసింది. 'మేం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఈ విషయంలో మేం ఆర్డర్‌ను రిజర్వ్ చేస్తున్నాం.' అని న్యాయమూర్తులు అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.