Republic day 2025 : రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? చరిత్ర ఏం చెబుతోందంటే..
Republic day 2025 : రిపబ్లిక్ డేని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారు? భారత రాజ్యాంగం సరిగ్గా అదే తేదీన ఎందుకు అమల్లోకి వచ్చింది? ఈ ఆసక్తికర విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి..
76వ గణతంత్ర దినోత్సవానికి దేశం ముస్తాబైంది. ఇంకొన్ని గంటల్లో దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్య పథ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. రిపబ్లిక్ డేని ఘనంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరిగాయి. అంతా బాగానే ఉంది కానీ! అసలు జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము? జనవరి 27న ఎందుకు కాదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. చరిత్రలో వెనక్కి వెళ్లాల్సిందే!

రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు?
1947 ఆగస్ట్ 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి, ప్రతియేటా అదే రోజున ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. అయితే, 1950 జనవరి 26న రాజ్యంగం అమల్లోకి వచ్చింది కాబట్టి, ప్రతియేటా అదే రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. ఇది తెలిసిన విషయమే.
ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించేందుకు, స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే.. బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఈ కమిటీ చాలా కృషి చేసింది. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2ఏళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం తీసుకుంది. అలా 1949 నవంబర్ 26న భారత దేశం రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందుకే.. ఆరోజును “రాజ్యాంగ దినోత్సవం”గా జరుపుకుంటాము.
1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించారే కానీ దానిని అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేద్దాము? అని ఆలోచిస్తుండగా.. అప్పటి రాజకీయ పెద్దలకు 'జనవరి 26' సరైన తేదీ అనిపించింది. ఇందుకు ఓ ముఖ్య కారణం ఉంది.
బ్రిటీష్ పాలనపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోరాడుతున్న సమయం అది. 1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అదొక కీలక ఘట్టంగా భావిస్తారు.
అందుకే.. 20ఏళ్ల తర్వాత అదే రోజున, అంటే జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అలా 1950, జనవరి 26వ తేదీన భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇండియా.. రిపబ్లిక్ నేషన్‌గా అవతరించింది.
మువ్వన్నెల జెండా రెపరెపలు..
1950 నుంచి ప్రతియేటా గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూ, వాడ.. అందరు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. పంద్రాగస్టు తర్వాత.. దేశంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్స్‌లో ఈ రిపబ్లిక్ డే ఒకటి.
గణతంత్ర దినోత్సవం రోజు.. భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి.. కర్తవ్య పథ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం.. రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత.. జీవితంలో ధైర్యసాహాసలు కనబర్చి, ప్రత్యేకంగా నిలిచిన వారికి అవార్డులు ఇస్తారు.
సంబంధిత కథనం