Justin Trudeau resign : కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా
Justin Trudeau resign why : దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
దాదాపు దశాబ్ద కాలం పాటు కెనడా ప్రధానమంత్రిగా ఉన్న జస్టిన్ ట్రూడో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి తానొక "పోరాట యోధుడు" అని, కానీ అక్టోబర్‌లో జరగబోయే ఎన్నికలకు దేశాన్ని నడిపించడానికి తాను ఉత్తమమైన వ్యక్తిని కాదని గ్రహించినట్టు, అందుకే తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
జస్టిన్ ట్రూడో ప్రకటన సంచలనం ఏమీ కాదు! ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఒకప్పుడు గోల్డెన్ బాయ్‌గా గుర్తింపు పొందిన ట్రూడో పతనం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు కెనడా భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తన రాజీనామా కెనడా రాజకీయాల్లో పోలరైజేషన్‌ని తగ్గిస్తుందని, పార్లమెంటు పనితీరుకు సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. "పోరాటాన్ని ఎదుర్కోవడంలో నేను సులభంగా వెనక్కి తగ్గను. ఇది ముఖ్యంగా మా పార్టీకి, దేశానికి చాలా ముఖ్యమైనది. కెనడియన్ల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య శ్రేయస్సు నాకు ప్రియమైనవి. అందుకే ఈ పని చేస్తున్నాను," అని ట్రూడో చెప్పుకొచ్చారు. లిబరల్ పార్టీ కొత్త నాయకుడికి మద్దతు ఇవ్వాలని ట్రూడో కెనడియన్లకు పిలుపునిచ్చారు.
ట్రూడో రాజకీయాల్లో చేసిన తప్పేంటి?
మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడిగా.. వేగంగా అధికారంలోకి రావడంతో ట్రూడో కెరీర్ ఆశాజనకంగా ప్రారంభమైంది. 2015లో ఘనవిజయం సాధించడంతో కెనడా చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన రెండో ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు.
గంజాయిని చట్టబద్ధం చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి విధానాలు, ఇండీజీనియస్ కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను పరిష్కరించడం వంటి కొన్ని విజయాలు ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలుగా ఉన్నాయి.
అయితే కొన్నేళ్లుగా ట్రూడో పాపులారిటీ తగ్గిపోయింది! ఆయన అప్రూవల్ రేటింగ్స్ నాటకీయంగా పడిపోయాయి. 2023 చివరి నాటికి, వలసలు, గృహాల ధరలు, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యల పట్ల ఆయన తీరు పట్ల చాలా మంది కెనడియన్లు అసంతృప్తి చెందారు.
ట్రంప్ సుంకాలు..
జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో కెనడాకు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ట్రూడోపై పిడుగు పడినట్టైంది! కెనడా వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు అప్పటి నుంచి కెనడాను అమెరికాలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఇది ట్రూడో నాయకత్వానికి మచ్చగా మారింది.
కోవిడ్ 19 శకం..
2021లో కోవిడ్ -19 నాలుగో వేవ్ సమయంలో జస్టిన్ ట్రూడో ఆకస్మిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. మహమ్మారిపై తన పోరాటానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుందని భావించారు. కానీ మెజారిటీ సాధించడంలో విఫలమయ్యారు.
కుంభకోణాలు, అంతర్గత సంఘర్షణలు..
జాతి వివక్షకు సంబంధించిన బ్లాక్ ఫేస్ స్కాండల్ వల్ల ట్రూడో ఇమేజ్‌కు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఉపప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. త్వారా ట్రూడోపై రాజీనామా ఒత్తిడిని పెంచింది.
ట్రూడో తన వ్యక్తిగత జీవితంలోనూ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆగస్టు 2023లో తన భార్య సోఫీ గ్రెగోయిర్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు.
అక్టోబర్ 20న జరగనున్న ఎన్నికలకు ముదు అవిశ్వాస ఓట్లు, రాజీనామా డిమాండ్లతో ట్రూడో నాయకత్వం ఒత్తిడిని ఎదుర్కొంది.
సంబంధిత కథనం