Israel- Iran war: ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య సంఘర్షణ ఎందుకు, ఎలా ప్రారంభమైంది?.. టైమ్ లైన్-why are israel hezbollah and iran fighting a timeline of the conflict ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Israel- Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య సంఘర్షణ ఎందుకు, ఎలా ప్రారంభమైంది?.. టైమ్ లైన్

Israel- Iran war: ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య సంఘర్షణ ఎందుకు, ఎలా ప్రారంభమైంది?.. టైమ్ లైన్

Sudarshan V HT Telugu
Oct 02, 2024 03:49 PM IST

ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కు సాయంగా అమెరికా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య సంఘర్షణ ఎందుకు, ఎలా ప్రారంభమైంది?
ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య సంఘర్షణ ఎందుకు, ఎలా ప్రారంభమైంది? (via REUTERS)

ఇజ్రాయెల్ భూభాగంలోకి 200 క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు యుద్ధంగా పరిణమిస్తుందా? ఇతర దేశాల జోక్యంతో అది మూడో ప్రపంచ యుద్ధం (world war 3) గా కూడా మారుతుందా?.. ఇది ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ప్రశ్న. అయితే, ఈ ఇజ్రాయెల్ - లెబనాన్ - ఇరాన్ సంఘర్షణ ఇంత తీవ్ర రూపం దాల్చడానికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1979 నుంచి..

ఇటీవలి వారాల్లో, ఇజ్రాయెల్, ఇరాన్ మద్ధతున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా, ఇరాన్ ల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల లెబనాన్ లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి చెందడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. అయితే, ఈ ఘర్షణల మూలాలు 1979 లో ఉన్నాయి.

అమెరికా వ్యతిరేక సెంటిమెంట్

1979 లో, ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇరాన్ తన చివరి రాజు షా మొహమ్మద్ రెజా పహ్లవిని గద్దె దింపింది. లెబనాన్ లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ వంటి ఈ ప్రాంతంలో స్వేచ్ఛను కోరుతున్న ఇతర మిలిటెంట్ గ్రూపులతో జతకట్టింది. ఈ కాలం ఇరాన్, హిజ్బుల్లాలను ఏకతాటిపైకి తెచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ అనుసరించిన పాలస్తీనా వ్యతిరేక ధోరణి కారణంగా పొరుగు దేశం ఇజ్రాయెల్ తో ఇరాన్ కు సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే, అమెరికా వ్యతిరేక భావన అమెరికాతో మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ను దూరం చేసింది.

అక్టోబర్ 7, 2023 - మంటలకు ఆజ్యం

సిరియా యుద్ధం, సిరియాలోని గోలన్ హైట్స్ పై ఇజ్రాయెల్ ఆక్రమణ సమయం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు రగులుతూనే ఉన్నాయి. అయితే, 2023 అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హతమార్చింది. చాలామందిని బందీలుగా తీసుకువెళ్లింది. ఈ మెరుపు దాడితో ఇజ్రాయెల్ నివ్వెరపోయింది. వెంటనే, హమాస్ పై యుద్ధం ప్రకటించి, హమాస్ ప్రబలంగా ఉన్న పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41,600 మంది మరణించారని పాలస్తీనా ప్రకటించింది. అక్టోబర్ 7న జరిగిన సంఘటనల గురించి తమకు తెలియదని ఇరాన్ ఖండించినప్పటికీ, హమాస్ తో ఇరాన్ కు ఉన్న సంబంధాల కారణంగా ఇరాన్ ను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిందించింది. అదే సమయంలో, లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ దళాల మధ్య పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

ప్రత్యక్ష దాడులు

గత సంవత్సరం డిసెంబర్ లో సిరియాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ నేత సయ్యద్ రజీ మౌసవి మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ డమాస్కస్ లోని ఓ భవనంపై బాంబు దాడి చేసి ఐఆర్ జీసీకి చెందిన మరో ఐదుగురిని హతమార్చిందని ఇరాన్ ఆరోపించింది. మార్చిలో జరిగిన మరో బాంబు దాడిలో డమాస్కస్ లో ఇద్దరు ఐఆర్ జీసీ సభ్యులు మరణించారు. ఏప్రిల్ లో ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులతో సిరియాలోని తమ కాన్సులేట్ ధ్వంసమైన తర్వాత ఇరాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ దాడిలో ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ సహా 13 మంది మరణించారు. ఈ ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ 'ట్రూ ప్రామిస్' పేరుతో ఇజ్రాయెల్ పై 300కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

సెప్టెంబర్ 17 - పేజర్ పేలుళ్లు

సెప్టెంబర్ 17 న లెబనాన్, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో ఏకకాలంలో వందలాది పేజర్లు పేలాయి. హిజ్బుల్లా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆ పేలుళ్లలో పలువురు పౌరులు, హెజ్బొల్లా సానుభూతిపరులు, మిలిటెంట్ నాయకులు మరణించారు. ఆ తరువాత, ఇజ్రాయెల్ బీరుట్ లోని దహియే ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వరుస వైమానిక దాడులు చేసింది. సెప్టెంబర్ 26న రోజుల తరబడి సాగిన భారీ బాంబుదాడిలో సుమారు ఏడు భవనాలు నేలమట్టం కాగా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లా (Hezbollah) స్థావరాలను ఏరివేసేందుకు లెబనాన్ లో భూదాడులు ప్రారంభిస్తామని సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి కూడా ప్రాణహాని ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇరాన్ దాడులు

ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్ పై 200 క్షిపణులతో దాడి చేసింది. హిజ్బుల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ లో మరో ఐదు వైమానిక దాడులతో ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడికి దిగింది. ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ప్రకటించింది.