Bharata Nyaya Sanhita: బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే పదేళ్లు జైలు శిక్ష-why a breakup could land men in jail for 10 years section 69 of bns explained ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharata Nyaya Sanhita: బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే పదేళ్లు జైలు శిక్ష

Bharata Nyaya Sanhita: బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే పదేళ్లు జైలు శిక్ష

HT Telugu Desk HT Telugu

Bharata Nyaya Sanhita: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తాజాగా భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. ఇందులోని సెక్షన్ 69 ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే పదేళ్లు జైలు శిక్ష

ఒక వ్యక్తి తన భాగస్వామిని వివాహం చేసుకుంటానని చెప్పి, శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తరువాత పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదనంగా జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు బ్రిటీష్ కాలం నాటి భారతీయ శిక్షాస్మృతి (IPC) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 69 స్ఫష్టం చేస్తుంది.

బీఎన్ఎస్ లో అనేక మార్పులు

ఐపీసీ స్థానంలో తీసుకువచ్చిన బీఎన్ఎస్ లో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా ‘సెక్షన్ 69’ ను బీఎన్ఎస్ లో పొందుపర్చింది. వివాహం లేదా ఉద్యోగం లేదా ఇతర విషయాల గురించి భాగస్వామికి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, ఆ భాగస్వామితో లైంగిక సంబంధం కొనసాగిస్తూ మోసం చేస్తే ఆ వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు..

చట్టంలోని సెక్షన్ 69 ఏం చెబుతోంది?

భారతీయ న్యాయ్ సంహిత (BNS) లోని ఈ సెక్షన్ 69లో.. ‘‘మోసపూరిత మార్గాల ద్వారా లేదా దానిని నెరవేర్చే ఉద్దేశ్యం లేకుండా ఒక మహిళను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేయడం ద్వారా ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉన్నవారికి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. అయితే, ఈ నేరం అత్యాచారం నేరం కిందకు రాదు’’ అని ఉంది. ఈ సెక్షన్ లోని ‘‘మోసపూరిత మార్గాలు’’ లో .. ‘ఉద్యోగం, పదోన్నతి లేదా ఒకరి గుర్తింపును దాచడం ద్వారా వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానాల ద్వారా ప్రేరేపించడం‘ వంటివి వస్తాయి.

వివాహం లేదా ఉపాధి గురించి తప్పుడు మాటలు

వివాహం లేదా ఉపాధి గురించి తప్పుడు మాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని బీఎన్ఎస్ నేరంగా పరిగణిస్తుంది. బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా నిజమైన ఉద్దేశం లేకుండా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, ఫలితంగా లైంగిక చర్యకు పాల్పడితే వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఐపీసీలో ఏ సెక్షన్?

గతంలో ఇలాంటి సందర్భాల్లో ఐపీసీ సెక్షన్ 90 లో.. అవాస్తవాలు చెప్పి, లైంగిక చర్యలో పాల్గొంటే, అది అంగీకారంతో కూడిన శృంగారంగా పరిగణించబోరని ఉంది. ఒక వ్యక్తి గాయపరుస్తారనే భయంతో లేదా అబద్ధాలను విశ్వసించి లైంగిక చర్యకు సమ్మతి ఇచ్చినట్లయితే, దానిని వాస్తవంగా అంగీకారంగా పరిగణించరు. ఇది ఐపీసీ సెక్షన్ 375 కింద అభియోగాలకు ప్రాతిపదికగా ఉంటుంది.

బీఎన్ ఎస్ లో మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలు

జులై 1వ తేదీ నుంచి బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. వాటిలో ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ్ సంహిత(BNS), ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (BSA), సీఆర్పీసీ స్థానంలో భారతీయ నగరిక్ సురక్షా సంహిత (BNSS) లు ఉన్నాయి. లైంగిక నేరాలను విచారించడానికి బీఎన్ఎస్ లో ప్రత్యేక అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేరాలను గతంలో ఐపీసీలోని 'మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాలు' అనే అధ్యాయం ప్రకారం విచారించేవారు.

మైనర్లపై అత్యాచారాలకు..

అంతేకాకుండా 18 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా బీఎన్ఎస్ లో మార్పులు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న అత్యాచార నిబంధనలను మరింత కఠినతరం చేస్తుంది. అలాగే మైనర్లపై సామూహిక అత్యాచారం విచారణను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POKSO) తో అనుసంధానిస్తుంది. మైనర్లపై అత్యాచారాలకు సంబంధించి.. 18, 16, 12 ఏళ్ల లోపు వారిని వేరువేరు బాధితులుగా పేర్కొంటూ వయసు ఆధారిత వర్గీకరణను బీఎన్ఎస్ ప్రవేశపెట్టింది. ఈ కేసులకు వేర్వేరు శిక్షలు ఉంటాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.