BJP President : బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా కే లక్ష్మణ్..?
జేపీ నడ్డాకు కేంద్రంలో ఆరోగ్యశాఖ మంత్రి పదవి దక్కడంతో.. బీజేపీ తదుపరి అధ్యక్షుడు ఎవరవుతారు? అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ కీలక నేత కే లక్ష్మణ్.. రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
BJP new president : జేపీ నడ్డా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో పలువురు ప్రముఖల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో.. తెలంగాణ బీజేపీ కీలక నేత కే.లక్ష్మణ్ సైతం ఉన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారు?
2014-19 మధ్యలో మోదీ కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు జేపీ నడ్డా. ఆ తర్వాత.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్నారు. పార్టీకి ఎనలేని సేవ చేసి, మంచి గుర్తింపు పొందారు. ఆయన నేతృత్వంలో బీజేపీ మరింత బలంగా ఎదిగింది. 2023లోనే ఆయన పదవీకాలం ముగియాల్సి ఉన్నా.. 2024 వరకు దానిని పొడిగించి, అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు పార్టీ బాధ్యతలను ఆయనపై పెట్టింది బీజేపీ హైకమాండ్.
కానీ.. ఇప్పుడు మోదీ 3.0 కేబినెట్లో మళ్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా చేరారు జేపీ నడ్డా. ఫలితంగా.. బీజేపీ తదుపరి అధ్యక్షుడు ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జేపీ నడ్డా స్థానాన్ని భర్తీ చేయడం అంటే సవాలుతో కూడుకున్న విషయం అని, ఆయన ఆ స్థాయిలో పనిచేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Who is BJP new president : మోదీ 3.0 కేబినెట్ ఏర్పాటుకు ముందే.. జేపీ నడ్డాఈసారి మంత్రివర్గంలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. ఆయన తర్వాత.. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఎపీ ధర్మేంద్ర ప్రధాన్ల పేర్లు వినిపించాయి. కానీ.. వారిద్దరు కూడా మోదీ కేబినెట్లో చేరడంతో.. బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ మరింత పెరిగింది.
బీజేపీ తదుపరి అధ్యక్షుడి కోసం హైకమాండ్ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ రేసులో బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే (మహారాష్ట్ర మాజీ మంత్రి) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శుల్లో తావ్డే చాలా కీలకంగా ఎదిగారు.
బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్, తెలంగాణ బీజేపీలో కీలక నేత కే. లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిపై పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
K laxman BJP new president : సునీల్ బన్సల్ (పశ్చిమ్ బెంగాల్ బీజేపీ, తెలంగాణ, ఒడిశా ఇన్ఛార్జ్), ఓమ్ మాథుర్ (రాజ్యసభ ఎంపీ) పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఈసారి బీజేపీకి తొలి మహిళా అధ్యక్షురాలు వచ్చే అవకాశం కూడా ఉందని రూమర్స్ జోరుగా సాగుతున్నాయి. బీజేపీకి మహిళా ఓట్లు తగ్గుతున్నాయన్న అభిప్రాయంలో ఉన్న కమలదళం.. ఈ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
మరి వీరిలో ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందో చూడాలి! పైగా.. మునుపటితో పోల్చితే.. బీజేపీ ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేకపోయింది. సొంతంగా 370 టార్గెట్ పెట్టుకున్న మోదీ టీమ్.. ఈసారి కనీసం మెజారిటీ దాటలేదు. ఇది.. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడికి సవాలుగా మారే విషయం. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటర్లు ఎందుకు ఓట్లు వేయలేదు? వంటివి తెలుసుకుని, వారిని ఆకర్షించి, ఆయా చోట్ల పార్టీని బలోపేతం చేసే బాధ్యత.. బీజేపీ నూతన అధ్యక్షుడిపై ఉంటుంది.
సంబంధిత కథనం