భారతీయ జనతా పార్టీ సంస్థాగత విషయాలపై, ముఖ్యంగా తన తదుపరి జాతీయ అధ్యక్షుడి నియామకంపై దృష్టి సారించే అవకాశం ఉంది. పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, జూన్ మధ్యలో అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. ఇది తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు పార్టీ రాజ్యాంగం ప్రకారం అవసరమైన ముందస్తు షరతు. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల 70 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించడం బీజేపీ చీఫ్ పదవిపై కేంద్ర నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
అయితే ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, అనంతరం భారత్ పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. జాతీయ స్థాయి నియామకానికి ముందు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా కీలక రాష్ట్రాలకు బీజేపీ కొత్త రాష్ట్ర శాఖ అధ్యక్షులను ఖరారు చేయవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
బీజేపీ జాతీయ ప్రధాన రేసులో ప్రధానంగా ముగ్గురు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒడిశాకు చెందిన కీలక ఓబీసీ నాయకుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధాన్ కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు. సంస్థాగతంగా పట్టు కలిగి ఉన్న నాయకుడు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి మరో గట్టి పోటీదారుగా ఉన్న వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత కేంద్ర మంత్రిగా తన క్షేత్రస్థాయి అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి పదవి నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి మారిన మనోహర్ లాల్ ఖట్టర్ పేరును కూడా కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ చీఫ్ గా అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే ప్రక్రియ అనేక సమీకరణాలతో కూడుకుని ఉంటుంది. సంస్థాగత అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, కుల సమతుల్యతను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు కేంద్ర నాయకత్వంతో సాన్నిహిత్యం, అగ్ర నేతలకు ఆ నాయకుడిపై విశ్వాసం ఉండాలి. ఇవన్నీ చూసే పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీని నడిపించేందుకు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడంతో నాయకత్వ మార్పుపై చర్చలు ఊపందుకున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో నామినేషన్ దాఖలు, పరిశీలన, అవసరమైతే ఓటింగ్ ఉంటాయి. జేపీ నడ్డా రెండోసారి పూర్తి స్థాయి అధ్యక్ష పదవిని ఆశిస్తారా లేక కొత్త ముఖాన్ని పార్టీ ఎంచుకుంటుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. బీజేపీలో పరిణామాలను విపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. 2026లో కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2029లో వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో కొత్త చీఫ్ కీలక పాత్ర పోషించనున్నారు.
సంబంధిత కథనం