Stormy Daniels: ట్రంప్ హుష్ మనీ కేసుతో పాపులర్ అయిన పోర్న్ స్టార్ ఎవరు? ఏంటా స్టోరీ?
Stormy Daniels: హుష్ మనీ కేసులో అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలిన నేపథ్యంలో, ఆ హుష్ మనీ కేసుకు కారణమైన అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఎవరనే ఆసక్తి ప్రజల్లో పెరిగింది. ఈ కేసులో ట్రంప్ ను దోషిగా తేల్చిన కోర్టు.. ఆయనకు ఎలాంటి జైలు శిక్ష కానీ, జరిమానా కానీ విధించలేదు.
Stormy Daniels: 'హుష్ మనీ' కేసులో డొనాల్డ్ ట్రంప్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ట్రంప్ కు బేషరతుగా డిశ్చార్జ్ శిక్ష విధిస్తామని ఇచ్చిన మాటను న్యాయమూర్తి జస్టిస్ జువాన్ మెర్చాన్ నిలబెట్టుకున్నారు. ట్రంప్ కు ఎలాంటి జైలు శిక్ష కానీ, జరిమానా కానీ విధించలేదు. దాంతో, అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఆటంకం కలగబోదు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం కారణంగా, ఆమెకు రహస్యంగా డబ్బు చెల్లించడం, ఆ మొత్తాన్ని దాచిపెట్టడానికి ట్రంప్ వ్యాపార రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.
స్టార్మీ డేనియల్స్ ఎవరు?
డేనియల్స్ (45) లూసియానాలో జన్మించిన అడల్ట్ ఫిల్మ్ స్టార్, దర్శకురాలు. ఆమె అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్. 2000వ దశకంలో వచ్చిన ది 40 ఇయర్స్ వర్జిన్, నాక్డ్ అప్ వంటి ప్రధాన హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. డేనియల్స్ 1997 లో లూసియానాలోని బాటన్ రూజ్ లోని స్కాట్లాండ్ విల్లే మాగ్నెట్ హైస్కూల్ లో విద్యను అభ్యసించారు. ఆమె ప్రారంభ రోజుల్లో జర్నలిస్ట్ కావాలనుకున్నారు. ‘‘నేను సగటు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబం నుండి వచ్చాను. కరెంటు లేని రోజులు ఉండేవి’’ అని ఆమె తన గతం గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇంతకీ ఆ డబ్బు కేసు ఏంటి?
జూలై 2006లో నెవాడాలోని లేక్ తాహోలో జరిగిన అమెరికన్ సెంచరీ సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ లో కలుసుకున్నప్పుడు తనకు, ట్రంప్ కు లైంగిక సంబంధం ఏర్పడిందని డేనియల్స్ వెల్లడించారు. ఈ లైంగిక సంబంధం గురించి తాను బహిరంగంగా మాట్లాడకుండా ఉండడానికి తనకు 1,30,000 డాలర్లు ఇచ్చారని ఆమె తెలిపారు. 2016 ఎన్నికలకు ముందు మైఖేల్ కోహెన్ అనే తన న్యాయవాది ద్వారా ట్రంప్ ఆ డబ్బు పంపించారని ఆమె కోర్టుకు వెల్లడించారు.
బెదిరించారు..
ట్రంప్ తో లైంగిక సంబంధం గురించి వెల్లడించకుండా, మౌనంగా ఉండాలని తనను చట్టపరంగా, శారీరకంగా బెదిరించారని ఆమె చెప్పారు. ఒకానొక సందర్భంలో ట్రంప్ తో తన సంబంధం గురించి ఇన్ టచ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించిన తర్వాత లాస్ వెగాస్ పార్కింగ్ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి తనను బెదిరించాడని ఆమె తెలిపారు. తన కుటుంబ భద్రత గురించి ఆందోళన చెందుతున్నందున తాను ఆ డబ్బును స్వీకరించానని డేనియల్స్ చెప్పారు. అయితే, ఈ ఆరోపణలను ట్రంప్ (donald trump) ఖండించారు.
టాపిక్