బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ, మాజీ జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా.. ఈయన ఎక్కడ నుంచి వచ్చారు?-who is rajeev shukla rajya sabha mp and former journalist set to become next bcci president ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ, మాజీ జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా.. ఈయన ఎక్కడ నుంచి వచ్చారు?

బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ, మాజీ జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా.. ఈయన ఎక్కడ నుంచి వచ్చారు?

Anand Sai HT Telugu

త్వరలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఆయన ఎవరో కాదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. ప్రస్తుత చీఫ్ రోజర్ బిన్నీ 2025 జూలైలో 70 ఏళ్లు నిండిన తర్వాత పదవి నుంచి వైదొలగుతారు.

రాజీవ్ శుక్లా (ANI)

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా పేరు తెరపైకి వచ్చింది. అనుభవజ్ఞుడైన రాజకీయ వ్యూహకర్త, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అయిన శుక్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

బిన్నీకి 70 ఏళ్లు

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుత చీఫ్ రోజర్ బిన్నీ 2025 జూలైలో 70 ఏళ్లు నిండిన తర్వాత పదవి నుంచి వైదొలగుతారు. భారత క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు దాటిన తర్వాత బీసీసీఐలో ఏ వ్యక్తి కూడా ఏ పదవిలో ఉండకూడదు..

రాజీవ్ శుక్లా ఎవరు?

బీసీసీఐ ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు. ఆయన ప్రారంభ జీవితం విద్యారంగం, జర్నలిజంపై ఉండేది. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన జనసత్తా, రవివర్ వంటి ప్రముఖ పబ్లికేషన్స్ లో పనిచేశారు. పదునైన రాజకీయ విశ్లేషణ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయనను రాజకీయాల్లో కెరీర్‌కు సహజంగానే వెళ్లేలా చేశాయి.

2000లో రాజీవ్ శుక్లా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదట్లో అఖిల భారతీయ లోక్ తాంత్రిక్ కాంగ్రెస్‌తో, ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌లోకి వచ్చారు. అనతికాలంలోనే జాతీయ అధికార ప్రతినిధిగా, ఆ తర్వాత రాజ్యసభలో ఎంపీ వరకు ఎదిగారు.

కీలక పదవులు

రాజీవ్ శుక్లా ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘంలో కీలక వ్యక్తి. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో సెక్రటరీగా పని చేశారు. ఆ తర్వాత బీసీసీఐ వైపు వచ్చారు. రాజీవ్ శుక్లా 2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. వివాదాల మధ్య 2013లో ఆయన తాత్కాలికంగా పదవి నుంచి వైదొలిగారు. చివరకు 2015లో మళ్లీ ఆ పదవిలోకి వచ్చారు. 2020లో బీసీసీఐ ఉపాధ్యక్షుడయ్యారు.

బిన్నీ స్థానంలో శుక్లా అధ్యక్షుడిగా నియమితులైతే జనరల్ బాడీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశాలన్నింటికీ ఆయన అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. బీసీసీఐ ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలు, ఇతర ఆర్థిక ప్రకటనలపై సంతకం చేయాల్సిన ముగ్గురు వ్యక్తులలో ఆయన ఒకరు అవుతారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.