Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఎవరు? నోబెల్ ఎందుకు వచ్చింది?
Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని నడిపిస్తారు
రిజర్వేషన్ కోటాపై రగిలిన మంటలు బంగ్లాదేశ్‌ను రాజకీయ సంక్షోభంలోకి నెట్టాయి. షేక్ హసినా రాజీనామా, పార్లమెంట్ రద్దుతో ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ జరిగింది. అయితే విద్యార్థి నేతలు మాత్రం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ వైపు మెుగ్గు చూపారు. షేక్ హసీనాను తీవ్రంగా విమర్శించే మహమ్మద్ యూనస్ ను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నియమించారు.
తన పాలనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఎన్నికలు నిర్వహించే వరకు యూనస్ ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు, సైనిక అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులతో కూడిన సమావేశంలో ఈ నియామకాన్ని చేశారు.
విద్యార్థుల డిమాండ్
హసీనా దేశం విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలోకి వెళ్లింది. సైన్యం తాత్కాలికంగా నియంత్రణను చేపట్టింది. కానీ ఎన్నికలకు సిద్ధం కావడానికి అధ్యక్షుడు మంగళవారం పార్లమెంటును రద్దు చేసిన తరువాత మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించేందుకు మహమ్మద్ యూనస్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఒలింపిక్స్ నిర్వాహకులకు సలహాలు ఇస్తూ ప్రస్తుతం పారిస్ లో ఉన్న మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని విద్యార్థి నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. మరోవైపు హసీనా రాజీనామాను దేశ రెండో విమోచన దినోత్సవంగా యూనస్ అభివర్ణించారు. ఇంతకీ మహమ్మద్ యూనస్ ఎవరు?
గ్రామీణ్ బ్యాంకు వ్యవస్థాపకుడు
ఆర్థికవేత్త, బ్యాంకర్ అయిన ముహమ్మద్ యూనస్ పేదరిక నిర్మూలన మీద చేసిన కృషికి నోబెల్ వచ్చింది. పేద వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలకు సహాయపడటానికి సూక్ష్మ రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇచ్చి పేదరికంపై గెలవచ్చని చెప్పారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధిని అట్టడుగు స్థాయి నుంచి పెంపొందించడానికి యూనస్, ఆయన గ్రామీణ బ్యాంకు చేసిన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. చిన్న రుణాలను అందించడానికి యూనస్ 1983లో గ్రామీణ బ్యాంకును స్థాపించాడు. పేదరిక నిర్మూలనలో బ్యాంక్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మైక్రోఫైనాన్స్ కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చింది.
షేక్ హసీనాతో దెబ్బతిన్న సంబంధాలు
అయితే 2008లో షేక్ హసీనాతో యూనస్‌కు సంబంధాలు తెగిపోయాయి. 2007లో దేశం సైనిక మద్దతు పాలనలో ఉన్న కాలంలో యూనస్ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించాడు. తరువాత ఉద్రిక్తత తలెత్తింది. అయితే తర్వాత షేక్ హసీనా యూనస్ మీద కక్ష పెంచుకుందని చెబుతారు.
యూనస్ మీద ప్రభుత్వం నిఘా
గ్రామీణ బ్యాంకు అధిపతిగా ఉన్నప్పుడు పేద గ్రామీణ మహిళల నుండి రుణాలు వసూలు చేయడానికి మహమ్మద్ యూనుస్ బలవంతం, ఇతర పద్ధతులను ఉపయోగించాడని షేక్ హసీనా ఆరోపించారు. యూనస్ ఈ వాదనలను ఖండించారు. 2011లో హసీనా ప్రభుత్వం బ్యాంక్ కార్యకలాపాలను పరిశీలించడం ప్రారంభించింది. తర్వాత పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో యూనస్‌ను మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి తొలగించడానికి దారితీసింది. 2013లో ప్రభుత్వ అనుమతి లేకుండా నిధులను స్వీకరించారనే ఆరోపణలపై ఆయన విచారణను ఎదుర్కొన్నారు. అంతేకాదు తర్వాత తాను స్థాపించిన ఇతర సంస్థల ద్వారా కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ ఏడాది ప్రారంభంలో యూనస్‌తో పాటు మరో 13 మందిపై బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక కోర్టు 2 మిలియన్ డాలర్ల కుంభకోణానికి సంబంధించిన అభియోగాలు మోపింది. యూనస్ నేరాన్ని అంగీకరించి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. షేక్ హసీనాతో సంబంధాలు తెగిపోవడం వల్లే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని మహమ్మద్ యూనస్ మద్దతుదారులు వాదిస్తారు.
యూనస్ 1940లో బంగ్లాదేశ్‌లోని ఓడరేవు నగరమైన చిట్టగాంగ్‌లో జన్మించారు. అమెరికాలోని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేసి, అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌కు వచ్చారు.