మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంంది. ప్రతిరోజూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. జితేంద్ర రఘువంశీ. ఈ కేసులో ఈ పేరు కొత్త టర్న్ తీసుకునేలా చేస్తుందా చూడాలి. రాజా రఘువంశీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. అతని భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి అనేవారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులను మేఘాలయకు తరలించారు. ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.
అయితే తాజాగా ఈ కేసులో జితేంద్ర రఘువంశీ అనే పేరు తెరపైకి వచ్చింది. రాజా రఘువంశీని చంపడానికి నియమించిన వారికి ప్రాథమిక చెల్లింపులు చేయడానికి సోనమ్.. జితేంద్ర రఘువంశీ ఖాతాను ఉపయోగించుకుంది. జితేంద్ర రఘువంశీ ఎవరన్న ప్రశ్నకు సోనమ్ సోదరుడు గోవింద్ మాట్లాడుడు. జితేంద్ర పేరిట సోనమ్ కోసం తామే యూపీఐ ఖాతాను తెరిచామని గోవింద్ తెలిపాడు. అయితే ఆమె పేరుతో ఎందుకు తెరవలేదో వివరించలేదు. జితేంద్ర తమ కజీన్ అని, గోదాములో పని చేస్తాడని గోవింద్ చెప్పుకొచ్చాడు.
దర్యాప్తులో జితేంద్ర పేరు బయటకు రావడంతో సోనమ్ హవాలా మార్గంలో లావాదేవీలు జరిపిందని, ఆమె కుటుంబ వ్యాపారానికి హవాలా లింకులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గోవింద్ ఈ వాదనలను తోసిపుచ్చాడు. జితేంద్ర కూడా తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగి అని, అతని ఖాతాలో వారి డబ్బు ఉంటుందని చెప్పాడు.
'హవాలాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పుడు కథనాలు రాస్తున్నారు. పేరు వినిపిస్తున్న జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి మా కజిన్. మా కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగి, గోడౌన్లో లోడింగ్, అన్లోడింగ్ చూసుకునేవాడు. అతని పేరు మీద ఉన్న ఖాతాలో వాస్తవానికి మా డబ్బు ఉంది. వ్యాపారం రోజువారీ ఖర్చుల కోసం పెట్టాం.'అని గోవింద్ పేర్కొన్నాడు.
రాజా రఘువంశీ కుటుంబాన్ని సోనమ్ సోదరుడు గోవింద్ పరామర్శించాడు. బాధిత కుటుంబాన్ని ఓదార్చాడు. రాజా హత్యలో తన సోదరి ప్రమేయం ఉందంటూ క్షమాపణలు చెప్పాడు. ఈ హత్య వెనుక సోనమ్ హస్తం ఉందని తాను భావిస్తున్నట్లు గోవింద్ తెలిపాడు. సోనమ్‌తో తమ కుటుంబం అన్ని సంబంధాలను తెంచుకుందని, న్యాయం కోసం పోరాటంలో రాజా రఘువంశీ కుటుంబానికి సహాయం చేస్తానని గోవింద్ అన్నారు.