Eknath Shinde : ఎవరీ​ ఏక్​నాథ్​ షిండే? ఉద్ధవ్​ ప్రభుత్వం నిలిచేనా? బీజేపీ పాత్ర ఎంత?-who is eknath shinde is uddhav thackeray government in trouble ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Who Is Eknath Shinde, Is Uddhav Thackeray Government In Trouble?

Eknath Shinde : ఎవరీ​ ఏక్​నాథ్​ షిండే? ఉద్ధవ్​ ప్రభుత్వం నిలిచేనా? బీజేపీ పాత్ర ఎంత?

Sharath Chitturi HT Telugu
Jun 21, 2022 11:57 AM IST

Eknath Shinde : శివసేన కీలక నేత ఏక్​నాథ్​ షిండే మాయం అవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఇందులో బీజేపీ పాత్ర ఉందా? ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం నిలిచేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.

ఏక్​నాథ్​ షిండే
ఏక్​నాథ్​ షిండే (HT_PRINT)

Eknath Shinde latest news : మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం ప్రమాదంలో పడింది! శివసేన కీలక నేత ఏక్​నాథ్​ షిండే అనూహ్యంగా మాయమవ్వడం, ఆయనతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న వార్తలు ఇప్పుడు సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరీ ఏక్​నాథ్​ షిండే? ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితేంటి?

ట్రెండింగ్ వార్తలు

శివసేనలో ఆయనే కీలకం..!

58ఏళ్ల ఏక్​నాథ్​ షిండే.. శివసేన పార్టీలోని ఓ కీలక నేత. ఆయన పూర్తి పేరు ఏక్​నాథ్​ సంభాజి షిండే. మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఆయన పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. 2004, 2009, 2014, 2019లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఠాణె ప్రాంతానికి చెందిన ఏక్​నాథ్​.. అక్కడ శివసేన ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. ఏక్​నాథ్​ షిండే తనయుడు శ్రీకాంత్​ షిండే.. లోక్​సభలో ఎంపీగా ఉన్నారు. ఏక్​నాథ్​ సోదరుడు ప్రకాష్​ షిండే.. కౌన్సిలర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

ఏక్​నాథ్​కు అనేక వర్గాల నుంచి మద్దతు కూడా ఉంది. ముఖ్యంగా.. శివసేనలోనే అనేకమంది ఎమ్మెల్యేలు ఆయన వెన్నంటే నిలబడతారు. ఫలితంగా పార్టీ, ప్రభుత్వంలో పలుమార్లు కీలక పదవులు చేపట్టారు.

బీజేపీ పాత్ర?

ఏక్​నాథ్​ షిండే ప్రస్తుతం.. ఎవరి ఫోన్​ కాల్స్​ ఎత్తడం లేదు. ఎవరికీ స్పందించడం లేదు. కాగా ఆయన గుజరాత్​లోని సూరత్​కు వెళ్లినట్టు, ఆయన వెంట 11కుపైగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు సమాచారం. ఐదుగురు స్వత్రంత్ర ఎమ్మెల్యేలు కూడా సూరత్​కు చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గుజరాత్​ అనేది బీజేపీకి అత్యంత బలమైన ప్రాంతం. మహారాష్ట్ర నుంచి ఏక్​నాథ్​ డైరక్ట్​గా గుజరాత్​ వెళ్లడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలోనే మహారాష్ట్రలోని బీజేపీ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢణవీస్​.. ఢిల్లీ వెళ్లినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఫలితంగా 'మాహా' రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయి? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మాటల యుద్ధం..

తాజా పరిణామాలతో శివసేన బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది శివసేన. కాగా.. తాము ఏక్​నాథ్​తో మాట్లాడినట్టు, పరిస్థితులను చక్కదిద్దుతున్నట్టు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. మహా వికాస్​ అఘాడీకి అసెంబ్లీలో బలం లేదని, వెంటనే తప్పుకోవాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది. 

కాగా.. మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. మరి ఇది సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపైనా? లేక తాజా పరిణామాల వల్లేనా? అన్నది స్పష్టత లేదు.

ప్రభుత్వానికి మహా కష్టాలు..

Maha Vikas Aghadi news : 288 స్థానాలకు 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ ఫిగర్​ 145. అధికారపక్షంగా బరిలో దిగిన బీజేపీకి 105 సీట్లు దక్కాయి. శివసేనకు 56, ఎన్​సీపీ 54, కాంగ్రెస్​కు 44 స్థానాలు వచ్చాయి. అంటే.. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కలేదు.

అక్కడే అసలు కథ మొదలైంది. సీఎం పదవిని పంచుకుంటేనే మద్దతిస్తామని బీజేపీకి తేల్చిచెప్పింది శివసేన. అందుకు బీజేపీ అంగీకరించలేదు. ఫలితంగా.. బీజేపీ- శివసేన మధ్య దశాబ్దాల మైత్రి తెగిపోయింది.

ఆ తర్వాత.. ఎన్​సీపీ, కాంగ్రెస్​తో కలిసి మహా వికాస్​ అఘాడీని ఏర్పాటు చేసింది శివసేన. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్