కెనడా మొదటి హిందూ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ గురించి తెలుసా?-who is anita anand know about canada first hindu foreign minister ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కెనడా మొదటి హిందూ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ గురించి తెలుసా?

కెనడా మొదటి హిందూ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ గురించి తెలుసా?

HT Telugu Desk HT Telugu

అనితా ఆనంద్ కెనడా రక్షణ మంత్రిగా, రవాణా మంత్రిగా, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేశారు.

కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ (AFP)

అనితా ఆనంద్ కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మెలానీ జోలీ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనంద్ ఎక్స్ లో మాట్లాడుతూ.. 'కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, మా బృందంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను..’ అని పేర్కొన్నారు.

28 మంది మంత్రులు, 10 మంది సహాయ కార్యదర్శులతో కూడిన 38 మంది సభ్యుల మంత్రివర్గాన్ని కార్నీ మంగళవారం ఏర్పాటుచేశారు. కొత్త క్యాబినెట్‌ వివరాలు వెల్లడించిన తరువాత కార్నీ తమ ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతలను వివరించారు. యునైటెడ్ స్టేట్స్‌తో కొత్త ఆర్థిక, భద్రతా సంబంధాలను సృష్టించడం, జీవన వ్యయాన్ని ఎదుర్కోవడం, కెనడా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.

అనితా ఆనంద్ ఎవరు?

అనితా ఇందిరా ఆనంద్ ఒక కెనడియన్ న్యాయవాది. ఆమె విద్యావేత్త, రాజకీయ నాయకురాలు. ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా, రవాణా మంత్రిగా, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేశారు. కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులైన తొలి హిందూ మహిళ కూడా ఆమెనే కావడం విశేషం.

ఆనంద్ 1960‌ల ప్రారంభంలో భారతదేశం నుండి కెనడాకు వలస వచ్చిన భారతీయ వలస డాక్టర్ తల్లిదండ్రులకు నోవా స్కోటియాలోని కెంట్విల్లేలో జన్మించారు. ఆమె తల్లి పంజాబ్‌కు చెందినవారు కాగా, తండ్రి తమిళనాడుకు చెందినవారు. ఆమెకు గీత, సోనియా అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

లిబరల్ పార్టీ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రొఫైల్ ప్రకారం అనితా ఆనంద్ స్కాలర్, న్యాయవాది, పరిశోధకురాలు. ఆమెకు నలుగురు సంతానం. క్వీన్స్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ స్టడీస్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్), డల్హౌసీ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ లా మరియు టొరంటో విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లా పట్టా పొందారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కెనడా పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మంత్రిత్వ శాఖకు ఆనంద్ నాయకత్వం వహించారు, దేశంలో టీకాలు, వ్యక్తిగత రక్షణ పరికరాల సేకరణను నిర్వహించారు.

తరువాత, జాతీయ రక్షణ మంత్రిగా పనిచేశారు. లైంగిక దుష్ప్రవర్తనను ఎదుర్కోవటానికి, కెనడియన్ సాయుధ దళాలలో సాంస్కృతిక మార్పును తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇవ్వడానికి సైనిక సహాయం, సిబ్బందిని అందించడానికి కెనడా చేసిన ప్రయత్నాలకు ఆమె నాయకత్వం వహించారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.