New Year: ఇక్కడ ఆల్ రెడీ న్యూ ఇయర్ వచ్చేసింది తెలుసా?.. కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ ప్లేస్ ఇదే..
New Year celebrations: ప్రపంచం 2025కు స్వాగతం పలికేందుకు వేడుకలతో సిద్ధమవుతోంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ ఒకే సమయానికి ప్రారంభం కాదు. నూతన సంవత్సరం మొదట ప్రారంభమయ్యే దేశం ఏంటో, కొత్త సంవత్సరం చివరగా వచ్చే దేశం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
New Year 2025 celebrations: డిసెంబర్ 31 అర్ధరాత్రి సమీపిస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. 2025 కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. భూమి భ్రమణం కారణంగా ప్రపంచంలో విభిన్న టైమ్ జోన్స్ ఉంటాయి. అందువల్ల ప్రతి ప్రాంతంలో వేర్వేరు సమయాల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మొదట కొత్త సంవత్సరం పసిఫిక్ సముద్రంలోని చిన్న దీవుల్లో ప్రారంభమవుతుంది. ఆ తరువాత క్రమంగా వివిధ దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి.
క్రిస్మస్ ఐలండ్, సమోవా ద్వీపం
2025 jసంవత్సరం మొదట ప్రారంభమయ్యే మొదటి ప్రదేశం రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటిలోని క్రిస్మస్ ఐలండ్ (కిరిటిమతి). ఇది పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న ద్వీపం. ఇక్కడ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే, మనకు మధ్యాహ్నం 3.30 అవుతున్న సమయంలో అక్కడ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అనంతరం, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు న్యూజిలాండ్ లోని చాథమ్ దీవుల్లో కొత్త సంవత్సరం వస్తుంది. ఆ తరువాత న్యూజిలాండ్ లోని ప్రధాన నగరాలైన ఆక్లాండ్, వెల్లింగ్టన్ లలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు నూతన సంవత్సరం వస్తుంది.
టోంగా, సమోవా, ఫిజీ ల్లో..
ఆ తరువాత పసిఫిక్ లో టోంగా, సమోవా, ఫిజీ ల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్, కాన్ బెర్రా నగరాల్లో 2025 ప్రారంభమవుతుంది. అడిలైడ్, బ్రోకెన్ హిల్, సెదునా వంటి చిన్న ఆస్ట్రేలియా నగరాల గుండా ఈ వేడుకలు కొనసాగుతాయి. ఆ తరువాత, ఈ జాబితాలోకి క్వీన్స్ లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా చేరుతాయి. సిడ్నీ, మెల్ బోర్న్, కాన్ బెర్రా, ఫిజీల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు, క్వీన్స్ లాండ్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
జపాన్, కొరియా, చైనాల్లో..
గడియారం ముందుకు సాగడంతో జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు కొత్త ఏడాది వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ వంటి నగరాలు ఈ జాబితాలో చేరుతుంది. అనంతరం, చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్ లలో అర్ధరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి.
ఆగ్నేయాసియాలో..
ఆ తరువాత, ఇండోనేషియా, థాయ్ లాండ్, మయన్మార్ లలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్, నేపాల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు శ్రీలంక, ఆ తరువాత వరుసగా భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ లు ఈ వేడుకలను జరుపుకుంటాయి.
లాస్ట్ స్టాప్: బేకర్ అండ్ హౌలాండ్ ద్వీపాలు
భూమిపై కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే చివరి ప్రదేశాలు హవాయికి నైరుతిలో ఉన్న బేకర్ అండ్ హౌలాండ్ అనే జనావాసాలు లేని ద్వీపాలు. ఈ మారుమూల దీవుల్లో చివరగా 2025 సంవత్సరం అడుగుపెడ్తుంది.