Allahabad High Court: సభ్య, నాగరిక సమాజంలో లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఎవరైనా జీవిత భాగస్వామి వద్దకు కాకుండా మరెక్కడికి వెళ్తారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిపై ఆయన భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపులు, అసహజ శృంగారం తదితర అభియోగాలను కొట్టివేసింది. ఈ అభియోగాలకు నిరూపించే సరైన సాక్ష్యాధారాలు లేవని, ఇవి వ్యక్తిగత వివాదాల కారణంగా ప్రేరేపించబడి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. నైతికంగా నాగరిక సమాజంలో జీవిత భాగస్వామి కాకపోతే తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఇంకెక్కడికి వెళ్తారని కోర్టు ప్రశ్నించింది.
ఎఫ్ఐఆర్, సాక్షుల వాంగ్మూలాల్లో సమర్పించిన సాక్ష్యాలు వరకట్న వేధింపుల ఆరోపణలను నిరూపించలేదని పేర్కొంటూ ప్రాంజల్ శుక్లాతో పాటు మరో ఇద్దరిపై నమోదైన కేసును అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనీశ్ కుమార్ గుప్తా కొట్టివేశారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు దంపతుల లైంగిక సంబంధం, కొన్ని లైంగిక చర్యలకు భార్య నిరాకరించడం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ ఆరోపణలు వరకట్న వేధింపులను సూచించలేదని, దంపతుల మధ్య వ్యక్తిగత విభేదాలను సూచిస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.
ఇరుపక్షాల మధ్య ప్రధానంగా లైంగిక చర్యలకు సంబంధించిన వివాదం ఉందని తెలుస్తోందని, వరకట్న వేధింపుల గురించి ఎక్కడా సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. వరకట్న డిమాండ్ కు సంబంధించి తప్పుడు, కల్పిత ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థి పక్షం ఎఫ్ ఐఆర్ నమోదు చేసిందని కోర్టు పేర్కొంది.
‘‘ఒక వ్యక్తి, భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు.. తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి జీవిత భాగస్వామిని కాకుండా మరెవరిని కోరుతారు? నైతికంగా నాగరిక సమాజంలో తమ శారీరక లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి వారు వేరే ఎక్కడికి వెళ్తారు?' అని కోర్టు ప్రశ్నించింది. అసహజ శృంగార చర్యలు, వరకట్న వేధింపుల ఆరోపణలపై పిటిషనర్ మీనా శుక్లా తన భర్త ప్రాంజల్ శుక్లాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అసహజ శృంగారంలో పాల్గొనాలని, అశ్లీల చిత్రాలను చూడటానికి తనను బలవంతం చేశారని ఆమె ఆరోపించారు. ప్రాంజల్ మద్యం సేవించి పోర్న్ సినిమాలు చూసేవాడని, తన భార్యతో అసహజ శృంగారానికి పట్టుబట్టేవాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. భార్యను వదిలేసి ఒంటరిగా సింగపూర్ వెళ్లినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
మీషా తన అత్తమామలు మధు శర్మ, పుణ్య శీల్ శర్మలపై వరకట్న వేధింపుల ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పెళ్లికి ముందు కట్నం డిమాండ్ చేయలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాని వివాహం తరువాత వరకట్నం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారని ఆరోపించింది. అయితే, ప్రాంజల్ పై ఎఫ్ఐఆర్ ను కోర్టు కొట్టివేసింది.