CM love story: ‘‘నాది కూడా లవ్ ఫెయిల్యూరే..’’; తన లవ్ స్టోరీ గుర్తు చేసుకున్న సీఎం
CM love story: కర్నాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య ఇటీవల ఒక కార్యక్రమంలో తన ప్రేమకథను గుర్తు చేసుకున్నారు. మైసూరులో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, కులాలు వేరు కావడం వల్ల తన ప్రేమకథ సుఖాంతం కాలేదన్నారు. ఇప్పుడు యువత కులాంతర వివాహాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
CM love story: కర్నాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య గురువారం సాయంత్రం మైసూరు లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తన ప్రేమకథను సభికులతో పంచుకున్నారు. తన యవ్వన రోజులను, తన విఫల ప్రేమకథను గుర్తు చేసుకున్నాడు.
కాలేజీ రోజుల్లో..
తాను లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించే సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించానని కర్నాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య వెల్లడించారు. ‘‘నేను న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు, ఒక అమ్మాయిని ప్రేమించాను. వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాను. నన్ను తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశాలు స్వచ్ఛమైనవి. నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను’’ అని సిద్ధరామయ్య వివరించారు.
కులాలు వేరు కావడంతో..
అయితే, తనది సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ కాదని సిద్ధ రామయ్య వెల్లడించారు. ‘‘మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని అమ్మాయి కుటుంబం ముందుకు తీసుకెళ్లినప్పుడు, వారు అంగీకరించలేదు. నేను వేరే కులానికి చెందినవాడిని కాబట్టి తమ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయలేమని ఆ కుటుంబం చెప్పింది. దీంతో నేను వెనక్కి తగ్గి నా సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా వివాహం కులాంతర వివాహం కాదు, అది నా కమ్యూనిటీలోనే జరిగింది’’ అని రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య (Siddaramaiah) తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని సభికులతో పంచుకున్నారు.
కులాంతర వివాహాలు చేసుకోండి
కులాంతర వివాహాలతో ముందుకు సాగాలని సిద్ధరామయ్య యువతను ప్రోత్సహించారు. ‘సమాజంలో కుల వివక్షను రూపుమాపడానికి అది కూడా ఒక మార్గమన్నారు. ‘‘సమాజంలో కులవివక్షను రూపుమాపడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది కులాంతర వివాహం కాగా, రెండోది అన్ని వర్గాల్లో సామాజిక, ఆర్థిక సాధికారత. సామాజిక, ఆర్థిక అభ్యున్నతి లేని సమాజంలో సామాజిక సమానత్వం సాధ్యం కాదు’’ అని సిద్ధరామయ్య అన్నారు.