శశిథరూర్ కుమారుడు ఎవరో తెలుసా? ఆపరేషన్ సింధూర్ పై తండ్రినే ప్రశ్నించాడు!-what question did tharoors journalist son ask him on operation sindoor details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  శశిథరూర్ కుమారుడు ఎవరో తెలుసా? ఆపరేషన్ సింధూర్ పై తండ్రినే ప్రశ్నించాడు!

శశిథరూర్ కుమారుడు ఎవరో తెలుసా? ఆపరేషన్ సింధూర్ పై తండ్రినే ప్రశ్నించాడు!

Sudarshan V HT Telugu

పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన అనంతరం భారతీయ ఎంపీలు ఆపరేషన్ సిందూర్ కు దారితీసిన వివరాలను వెల్లడించడానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. వారిలో కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ అమెరికాలో పర్యటిస్తున్నారు.

శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్

అమెరికాలో ఆపరేషన్ సింధూర్ పై బహుళ పార్టీల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ డీసీలో జరిగిన మీడియా సమావేశంలో ఒక కీలక ప్రశ్న వేశారు.

వాషింగ్టన్ పోస్ట్ లో గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్

గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించిన శశిథరూర్ అండ్ టీం మంగళవారం మధ్యాహ్నం వాషింగ్టన్ చేరుకున్నారు. శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ పోస్ట్ లో గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ గా పనిచేస్తూ గురువారం ఆ హోదాలో తన తండ్రిని మీడియా సమావేశంలో ఒక కీలక ప్రశ్న అడిగారు.

శశిథరూర్ కుమారుడు ఏం అడిగారు?

శశిథరూర్ ను ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ ఈ కింది విధంగా ప్రశ్నించారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనడానికి రుజువులు ఉన్నాయా? అని ఏ దేశమైనా ప్రశ్నించిందా?’’ అని ఇషాన్ ప్రశ్నించారు. పాకిస్తాన్ పాత్ర ఉందని తెలిపే రుజువుల గురించి ఏ దేశమైనా మీ ప్రతినిధి బృందం నుంచి ఆధారాలు కోరిందా? అని ప్రశ్నించారు. ‘‘నాకు చాలా ఆసక్తిగా ఉంది, ఈ పర్యటనలో మీరు వివిధ దేశాలలో పర్యటించారు. ఎవరైనా పహల్గామ్ ఉగ్ర దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందనడానికి ఆధారాలు చూపించమని మిమ్మల్ని అడిగారా?’’ అని ఇషాన్ థరూర్ తన తండ్రిని ప్రశ్నించారు.

శశి థరూర్ సమాధానం

పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు కనుక, ఏవరు తమను ఆధారాలు చూపమని అడగలేదని తన కుమారుడు అడిగిన ప్రశ్నకు శశిధరూర్ సమాధానమిచ్చారు. ఉగ్ర మూకలకు పాకిస్తాన్ సహకరిస్తుందన్న విషయం అన్ని దేశాలకు స్పష్టంగా తెలుసని అన్నారు. అయితే, మీడియా మాత్రం ఈ ప్రశ్నను రెండు మూడు చోట్ల అడిగిందని ఆయన అన్నారు.

మూడు కారణాలు

ఏ దేశం కూడా సాక్ష్యాధారాలు కోరకపోవడానికి మూడు కారణాలున్నాయని, ఈ విషయాన్ని లేవనెత్తినందుకు సంతోషంగా ఉందని శశిథరూర్ సరదాగా వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో పాక్ ప్రమేయంపై బలమైన ఆధారాలు లేకపోతే భారత్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకునేది కాదని ఆయన అన్నారు. ఈ మూడు కారణాలను ఈ విధంగా వివరించారు.

  • పదేపదే ఉగ్రదాడులు చేయడం, ఆ తర్వాత ఖండించడం గత 37 ఏళ్లుగా పాకిస్తాన్ చేస్తోంది. పాకిస్తాన్ లోని ఆర్మీ కంటోన్మెంట్ నగరంలోని సైనిక శిబిరం పక్కనే ఉన్న సేఫ్ హౌస్ లో అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ కాయిదా నేత ఒసామా బిన్ లాడెన్ తలదాచుకున్న విషయాన్ని అమెరికన్లు మర్చిపోలేదు.
  • ముంబై దాడుల్లో కూడా తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ ఖండించింది. అయితే, సజీవంగా పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఒకరు అదే దేశానికి చెందిన వ్యక్తిగా తేలింది. తాను ఎక్కడ శిక్షణ పొందానో, ఏం చేశారో ఆ ఉగ్రవాది స్పష్టంగా వివరించాడు.
  • పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని చెప్పుకుంటున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కరే తోయిబాకు ప్రసిద్ధ ప్రాక్సీ ఫ్రంట్. ఐక్యరాజ్యసమితి, అమెరికా విదేశాంగ శాఖ నిషేధించిన ఉగ్ర సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ ఉంది. పాకిస్థాన్ లోని మురిడ్కే పట్టణం దీనికి సురక్షిత స్థావరంగా ఉంది. చివరగా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మే 7 న భారతదేశం సైనిక దాడుల్లో మరణించిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల సభ్యులకు నిర్వహించిన అంత్యక్రియల దృశ్యాలకు మించిన రుజువులు ఏముంటాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.