Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా 'యూసీసీ' అవసరం ఉందా?-what is uniform civil code does india need ucc see full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా 'యూసీసీ' అవసరం ఉందా?

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా 'యూసీసీ' అవసరం ఉందా?

Sharath Chitturi HT Telugu
Published Jul 03, 2023 02:09 PM IST

Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఎన్నికల రాజకీయాల కోసమే నేతలు దీనిని ఉపయోగించుకుంటున్నారా? లేక ఇది నిజంగానే ఇండియాకు అవసరం ఉందా?

ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా 'యూసీసీ' అవసరం ఉందా?
ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి? ఇండియాకి నిజంగా 'యూసీసీ' అవసరం ఉందా? (HT_PRINT)

What is Uniform Civil Code : 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​) వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక మంది బీజేపీ నేతలు యూసీసీ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ యూసీసీ? దేశానికి యూసీసీ అవసరం నిజంగానే ఉందా? లేదా ఎన్నికల రాజకీయాల్లో ఇది ఒక భాగమా? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి..?

ఇండియాలో యూనిఫార్మ్​ క్రిమినల్​ కోడ్​ ఇప్పటికే అమల్లో ఉంది. అంటే.. నేరానికి పాల్పడే వారికి మతం, సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి కూడా ఒకరకంగా ఇలాంటిదే! కానీ చాలా క్లిష్టమైన విషయం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్థి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​.

ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడం ఈ యూసీసీ.

యూసీసీ గురించి భారత రాజ్యాంగం ఏం చెబుతోంది?

Uniform Civil Code meaning in Telugu : రాజ్యాంగాన్ని రచించిన వారు ఆర్టికల్​ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు.

వాస్తవానికి ఈ యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​పై ప్రభుత్వాలు మాట్లాడటం ఇది కొత్త విషయం ఏం కాదు. బీజేపీ కన్నా ముందే.. కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు చాలాసార్లు ఈ ఉమ్మడి పౌర స్మృతిపై చర్చలు జరిపాయి. కానీ ఇప్పటివరకు యూసీసీ కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే.. యూసీసీని అమలు చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి.

ఉమ్మడి పౌర స్మృతి అమలు ఎందుకు కష్టం..!

ఎన్నో మతాలు, విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవు భారత దేశం. ఇక్కడ చాలా వరకు అంశాలు మతాలు, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకు వేరువేరుగా చట్టాలు ఉన్నాయి. పెళ్లి నుంచి విడాకుల వరకు, ఆస్థి పంపకం నుంచి డబ్బు విషయం వరకు అన్నింటికీ వేరువేరు చట్టాలు ఉన్నాయి. అలాంటి భారత దేశంలో యూసీసీని అమలు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి:- UCC: ‘ఉమ్మడి పౌర స్మృతి’పై బీజేపీ అనుకున్నది సాధించగలదా?

ఇండియాకు యూసీసీ అవసరం ఉందా..?

ఇండియాకు యూసీసీ అవసరం ఉందని, దానికి మద్దతిచే వారు చెబుతుంటారు. ఉమ్మడి పౌర స్మృతితో లింగ సమానత్వం ఏర్పడుతుందని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది నిజమే. ఉమ్మడి స్మృతితో సమాన హక్కులు లభిస్తాయి. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సున్నితమైన, వివాదాస్పదమైన అంశాలను సైతం తొలగించవచ్చు.

Uniform Civil Code meaning : మరోవైపు యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​తో దేశం మొత్తం ఒక్కటవుతుందని, ఐకమత్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, ప్రజల్లో లౌకికవాదం పెంపొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

యూసీసీతో ప్రతికూలతలు ఏంటి?

యూసీసీని అమలు చేయడమే అతిపెద్ద ప్రతికూల విషయం అని విమర్శలు అంటుంటారు. భిన్న మతాలు, ఆచారాలకు నిలవు అయిన ఇండియాలో యూసీసీ వంటి చట్టాల అమలు అసాధ్యమని, ఒక వేళ అమలు చేసినా.. ప్రజల మత స్వేచ్ఛపై భారీ ప్రభావం పడుతుందన్నది విమర్శకుల వాదన.

మరోవైపు ఉమ్మడి పౌర స్మృతితో మైనారిటీలపై అధిక ప్రతికూల ప్రభావం పడుతుందని విమర్శలు అంటున్నారు. ఇప్పుడున్న వ్యక్తిగత చట్టాలు.. మతాల అనుగూణంగా ఉన్నాయని, వాటినే ప్రజలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. వీటి స్థానంలో యూసీసీని తీసుకొస్తే.. మైనారిటీలకు ఉన్న ప్రత్యేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​ను రూపొందించినా.. క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టమని స్పష్టం చేస్తున్నారు.

ఉమ్మడి పౌర స్మృతి- రాజకీయాల కోసమేనా?

Uniform Civil Code in India : దేశంలోని పార్టీలు.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ యూసీసీని వాడుకోవడం దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమతమ నియోజకవర్గాల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు, తరచుగా ఈ యూనిఫార్మ్​ సివిల్​ కోడ్​ అంశాన్ని లేవనెత్తి, ఈ ప్రయోజనాలుంటాయి.. ఆ ప్రయోజనాలంటూయని వారికి చెబుతున్నారని అంటున్నారు.

ఇలా ప్రతిసారి రాజకీయాలు అడ్డుపడుతుండటంతో.. ఉమ్మడి పౌర స్మృతిపై అసలైన, అవసరమైన చర్చలు తగ్గిపోతున్నాయన్నది విశ్లేషకుల మాట. ఫలితంగా యూసీసీలోని సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చలు జరగటం లేదన్నది వారి అభిప్రాయం.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.