టొమాటొ ఫ్లూ.. కేరళను వణికిస్తున్న కొత్త వ్యాధి!
కొత్త వ్యాధి కేరళను వణికిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారులే లక్ష్యంగా ఈ కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఇప్పటివరకు కొల్లాం జిల్లాలోనే 80 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వింతగా ఈ జబ్బు పేరు `టొమాటొ ఫ్లూ` లేదా `టొమాటొ ఫీవర్`.
కేరళలోని కొల్లాం జిల్లాలో కొత్త రకం జ్వర లక్షణాలతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో, అప్రమత్తమైన అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. దీనికి `టొమాటొ ఫ్లూ` అని పేరు పెట్టారు. ఇప్పటివరకు 80 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దాంతో, అధికారులు ఈ `టొమాటొ ఫ్లూ` నివారణ, చికిత్స విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కేరళలోని అర్యన్‌కావు, ఆంచల్, నెడువతూర్ తదితర ప్రాంతాల్లోనూ `టొమాటొ ఫ్లూ` కేసులు నమోదయ్యాయి.
లక్షణాలు..
ఈ `టొమాటొ ఫ్లూ` లక్షణాల్లో ప్రధానమైనవి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట, చర్మంపై దద్దుర్లు, చిన్నచిన్న పొక్కులు. ఇవి కాకుండా, విరోచనాలు, కడుపు నొప్పి, వాంతులు, చేతులు, మోకాళ్లు, పిరుదుల వద్ద చర్మం రంగు మారడం.. తదితర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాల లోపు పిల్లలలోనే ఇప్పటివరకు ఈ వ్యాధిని గుర్తించారు. ఇది త్వరగా ఇతరులకు సోకే ప్రమాదముందన్న వార్తలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమిళనాడు సహా కేరళ పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై, కేరళ నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు, చికన్ గున్యా లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. చికన్ గున్యాలోనూ జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట ఉంటాయి. ఈ వ్యాధి ఎలా వస్తుందనే విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదు. `టొమాటొ ఫ్లూ`కు కారణాలపై వైద్యులు పరిశోధనలు ప్రారంభించారు.
జాగ్రత్తలు..
`టొమాటొ ఫ్లూ` రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో, బయటా పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు. నీరు, అదికూడా శుభ్రమైన నీరు ఎక్కువగా తాగాలి. పైన చెప్పిన లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. టొమాటొ ఫ్లూ వచ్చిన పిల్లల నుంచి వేరే వారికి సోకే అవకాశముంది కాబట్టి, ఇతర పిల్లలతో వారిని కలవనివ్వకూడదు. టొమాటొ ఫ్లూ సోకిన తరువాత చర్మంపై వచ్చే దద్దుర్లు, పొక్కులను గోకడం, గిల్లడం వంటివి చేయకూడదు. ఈ వ్యాధి సోకిన పిల్లలకు మంచి ఆహారం, నిద్ర, విశ్రాంతి లభించేలా చూడాలి.
టాపిక్