Wagner Group: పుతిన్ కు చెమటలు పట్టిస్తున్న ఈ ‘వాగ్నర్ గ్రూప్’ కథేంటి?
ఉక్రెయిన్ తో యుద్ధంతో నిండా మునిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పిడుగులా పడింది వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు. ఒకప్పుడు పుతిన్ కు అన్నివిధాలా సహకరించిన ఈ ప్రైవేటు సేన.. ఇప్పుడు ఎందుకు తిరగబడుతోంది?
ఉక్రెయిన్ తో యుద్ధంతో నిండా మునిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ (putin) పై పిడుగులా పడింది వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటు. ఒకప్పుడు పుతిన్ కు అన్నివిధాలా సహకరించిన ఈ ప్రైవేటు సేన.. ఇప్పుడు ఎందుకు తిరగబడుతోంది?
వాగ్నర్ గ్రూప్..
ఇది ఒక ప్రైవేటు సేన. ఇన్నాళ్లూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు దేశ విదేశాల్లో అనధికార సేవలను అందించిన సైన్యం. దీన్ని పీఎంసీ వాగ్నర్ (PMC Wagner) గా పిలుస్తారు. రష్యా చట్టాలకు అతీతంగా ఇది పని చేస్తుంది. ఇందులోని సైనికులకు లభించే జీత భత్యాలు కూడా భారీగా ఉంటాయి. 2014 లో తూర్పు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులతో కలిసి పోరాటం చేసినప్పుడు మొదటిసారి ఈ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనిలో 50 వేల మందికి పై గానే సైనికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో రష్యా మాజీ సైనికులు, స్పెషల్ ఫోర్సెస్ సైనికాధికారులే 5 వేల మంది వరకు ఉంటారు. అయితే, దీనిపై అధికారిక లెక్కలేవీ లేవు.
ప్రిగోజిన్ తిరుగుబాటు
ఈ వార్నర్ గ్రూప్ నకు ప్రస్తుతం చీఫ్ గా ప్రిగోజిన్ (Prigozhin) వ్యవహరిస్తున్నారు. 1990 నుంచి ప్రిగోజిన్ పుతిన్ కు సన్నిహితుడు. మొదట ఫుడ్ వ్యాపారంలో ఉన్న ప్రిగోజిన్ క్రమంగా పుతిన్ అండదండలతో కీలక శక్తిగా ఎదిగారు. ఈ సైన్యానికి మొదటి కమాండర్ గా వ్యవహరించిన దిమిత్రి ఉత్కిన్ నిక్ నేమ్ వాగ్నర్. ఈ దిమిత్రి ఉత్కిన్ రష్యా సైన్యంలో లెఫ్ట్ నెంట్ కల్నల్ గా పని చేశారు. ఆయన పేరుపై ఈ ప్రైవేటు సైన్యానికి వాగ్నర్ గ్రూప్ అనే పేరు వచ్చింది. క్రమంగా అత్యంత సమర్ధవంతమైన ప్రైవేటు సైన్యంగా ఇది ఎదిగింది. ఈ సైన్యం సహకారంతోనే తాజా యుద్ధంలో ఉక్రెయిన్లోని కీలకమైన బాఖ్ముట్ నగరాన్ని గత నెలలో రష్యా స్వాధీనం చేసుకోగలిగింది.
ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు?
రష్యా రక్షణ శాఖ తో, ఆ శాఖ ఉన్నతాధికారులతో, రష్యా మిలటరీ సీనియర్ అధికారులతో వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ (Prigozhin) కు పడడం లేదు. ఉక్రెయిన్ లోని దోనెస్క్ ప్రాంతంలోని కీలకమైన సొలేదార్ పట్టణాన్ని తమ దళాలే స్వాధీనం చేసుకున్నా.. ఆ క్రెడిట్ మాత్రం రష్యా సైన్యం, రష్యా రక్షణ శాఖ తీసుకుందని ప్రిగోజిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో వాగ్నర్ సైనికులకు అవసరమైన ఆయుధ సాయం అందించడం లేదని, దాంతో తమ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని ఆయన మండి పడ్తున్నారు. ఈ విషయంలో అధ్యక్షుడు పుతిన్ కూడా సరిగ్గా వ్యవహరించలేదని విమర్శిస్తున్నాడు.