‘surya tilak’ of Ram Lalla: రామ్ లల్లా నుదిటిపై 'సూర్య తిలక్' ఎలా సాధ్యమైంది?.. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
‘surya tilak’ of Ram Lalla: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఏప్రిల్ 17న అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడి ‘సూర్య తిలక్’ ఏర్పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) లోని రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూర్య తిలక్ శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12. 15 నిమిషాలకు సూర్యకిరణం లేదా సూర్య తిలకం రామ్ లల్లా విగ్రహం నుదుటిపై ప్రకాశిస్తుంది.
సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూర్కీ శాస్త్రవేత్తల కృషి
శ్రీరామ నవమి రోజు అయోధ్యలో గర్భాలయం (Ayodhya Ram Mandir) లోని రామ్ లల్లాపై సూర్యకిరణాలు పడేలా సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూర్కీ శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రధాని మోదీ (PM Modi) సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. కోణార్క్ దేవాలయంలో మాదిరిగా అయోధ్య రామాలయంలో, ప్రతీ శ్రీరామ నవమి రోజు కూడా బాల రాముడి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా చూడాలని ప్రధాని మోదీ సూచించారు. దాంతో సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూర్కీ (CSIR-CBRI Roorkee) శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు.
చైత్ర మాసం 9 వ రోజున..
శ్రీరామ నవమి (Shri Ram Navami) రోజు అయోధ్యలో గర్భాలయంలోని రామ్ లల్లాపై సూర్యకిరణాలు పడేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో అద్దాలు, లెన్సులతో వినూత్న ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా అద్దాలు, లెన్స్ లను అమర్చారు. శ్రీరాముడి జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా చైత్రమాసం తొమ్మిదో రోజున ఈ సూర్య తిలక్ కార్యక్రమం జరుగుతుంది.
150 ఎల్ ఈ డీ స్క్రీన్స్
రామ్ లల్లా సూర్యాభిషేకం అత్యంత నాణ్యమైన అద్దాలు, లెన్సులతో కూడిన ఆప్టోమెకానికల్ వ్యవస్థను ఉపయోగించి నిర్వహించనున్నారు. సూర్య తిలకం సందర్భంగా రామాలయంలోకి భక్తులను అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. రామనవమి వేడుకలను పురస్కరించుకుని ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో 100, ప్రభుత్వం 50 ఎల్ ఈడీలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు తాము ఉన్న చోట నుంచే వేడుకలను వీక్షించగలుగుతారు' అని పేర్కొన్నారు.
ప్రతీ శ్రీరామ నవమి రోజు రామ్ లల్లాకు సూర్యాభిషేకం
అయోధ్య (Ayodhya)లో కొత్తగా నిర్మించిన రామాలయం లోపల లెన్సులు, అద్దాలను అమర్చడం వల్ల ఈ ఏడాది నుంచి ప్రతి శ్రీరామనవమికి సరిగ్గా మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహం నుదుటిపై ఒకే సూర్యకిరణం ప్రకాశిస్తుంది. 'సూర్య తిలకం' శ్రీరాముడి పుట్టిన శుభ దినాన్ని సూచిస్తుంది. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి నుదుటిపై తిలకం వేయడమే సూర్య తిలక్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం శ్రీరాముడి నుదుటిపై సూర్యరశ్మిని తీసుకొస్తామని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ రూర్కీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్కే పాణిగ్రాహి తెలిపారు.
దాదాపు 4 నిమిషాల పాటు..
ప్రతి సంవత్సరం సూర్యుడి స్థానం మారుతుందని, వివరణాత్మక లెక్కల ప్రకారం, శ్రీరామనవమి (Shri Ram Navami) తేదీ ప్రతి 19 సంవత్సరాలకు పునరావృతమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. విగ్రహం నుదుటిపై కనిపించే తిలకం పరిమాణం 58 మి.మీ ఉంటుంది. రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు సుమారు మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు పడుతాయి. ఆ సమయంలో రామ్ లల్లా నుదుటిపై తిలకం, రెండు నిమిషాల నిండు వెలుగుతో కనిపిస్తుంది.
'సూర్య తిలక్' వెనుక ఉన్న సైన్స్
సూర్య కిరణాలు మొదట ఆలయం పై అంతస్తులో ఏర్పాటు చేసిన అద్దంపై పడతాయని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ శాస్త్రవేత్త వివరించారు. వ్యూహాత్మకంగా అమర్చిన మూడు లెన్సులను ఉపయోగించి ఈ కిరణాలను ఆలయంలోని రెండో అంతస్తులోని మరో అద్దం వైపు మళ్లిస్తారు. ఆ తరువాత, అక్కడి నుంచి మరో అద్దం ఉపయోగించి సూర్య కిరణాలను గర్భ గుడి లోని రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడేలా చేస్తారు.