US Election 2024 : అమెరికా ఎన్నికల్లో 'అక్టోబర్ సర్‌ప్రైజ్' భయం.. ట్రంప్‌పై కమలా హారిస్ గెలుస్తారా?-what is october surprise in us elections is this repeat in american presidential elections 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Election 2024 : అమెరికా ఎన్నికల్లో 'అక్టోబర్ సర్‌ప్రైజ్' భయం.. ట్రంప్‌పై కమలా హారిస్ గెలుస్తారా?

US Election 2024 : అమెరికా ఎన్నికల్లో 'అక్టోబర్ సర్‌ప్రైజ్' భయం.. ట్రంప్‌పై కమలా హారిస్ గెలుస్తారా?

Anand Sai HT Telugu Published Oct 09, 2024 12:57 PM IST
Anand Sai HT Telugu
Published Oct 09, 2024 12:57 PM IST

US Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రపంచం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఎప్పటిలాగే అక్టోబర్ సర్‌ప్రైజ్ ఏదైనా ఉంటుందా అని అమెరికా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చరిత్రలో అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌కు చాలా పేరు ఉందని చెబుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్
డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్

డెమెుక్రటిక్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన కమలా హారిస్ యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్నారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు. ఈ పోరుపై ప్రపంచం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు మరో నెల మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇటీవల యూఎస్ పోలింగ్ నోస్ట్రాడమ్‌గా పిలిచే లిచ్‌మన్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

ఎందుకంటే గత పది యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో తొమ్మిదింటిని కచ్చితంగా అంచనా వేశారు లిచ్‌మన్. అందుకే అతడిని యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమ్ అంటుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిచ్‌మాన్ మాట్లాడుతూ.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించనున్నట్లు చెప్పారు. దీనితో అమెరికా ఎన్నికలపై మరింత ఆసక్తి పెరిగింది.

చాలా మంది అక్టోబర్ సర్‌ప్రైజ్ ఏదైనా ఉంటుందా అని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఈ అక్టోబర్ సర్‌ప్రైజ్‌కు చాలా పేరు ఉంది. అయితే లిచ్‌మన్ మాత్రం అక్టోబర్ ప్రభావంతో సంబంధం లేకుండా డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని అంచనా వేశారు. గత కొన్ని దశాబ్దాలుగా కచ్చితమైన పోల్ అంచనాలతో యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమ్‌గా లిచ్‌మన్ పేరు సంపాదించాడు.1984 నుండి ఒక ఎన్నికల్లో తప్ప అన్నింటిని సరిగ్గా అంచనా వేశాడు.

అక్టోబర్ సర్‌ప్రైజ్ ఏంటి?

అమెరికన్ రాజకీయాల్లో అక్టోబర్ సర్‌ప్రైజ్‌కు చాలా పేరు ఉంది. నిజానికి అక్టోబర్ సర్‌ప్రైజ్ గురించి అధికారికంగా ఎటువంటి రికార్డు లేదు. కానీ 1980 సమయంలో జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌లో అమెరికన్ బందీలను విడుదల చేయడం కోసం ఒప్పందం చేసుకున్నాడు. చివరి నిమిషంలో చేసిన ఈ ఒప్పందం జిమ్మీ కార్టర్‌కు తిరిగి ఎన్నిక కావడానికి మద్దతును ఇస్తుందనుకున్నాడు. అయితే అన్నీ కార్టర్‌కు వ్యతిరేకంగా మారాయి, అతను ఓడిపోయాడు. ఇది అక్టోబర్‌లోనే జరిగింది. అప్పటి నుంచి అక్టోబర్ సర్‌ప్రైజ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

అప్పటి నుండి ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు అక్టోబర్‌ సర్‌ప్రైజ్ గురించి ఏదో ఒకటి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో యూఎస్ ఎన్నికలకు ముందు హిల్లరీ క్లింటన్ ఇమెయిల్‌లపై విచారణ, 2020లోనూ జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ ల్యాప్‌టాప్ చుట్టూ ఉన్న వివాదం నడిచింది. రహస్య పత్రాలకు సంబంధించిన విషయాలు అప్పట్లో బిడెన్ మెడకు చుట్టుకున్నాయి.

అక్టోబర్ సర్‌ప్రైజ్ పదే పదే అమెరికాలో ఏదో ఒక రకంగా అంతరాయం కలిగించిందని నమ్మకం. ఈసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేలా ఉందని అంటున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.