ChatGPT: ప్రపంచమంతా ‘చాట్ జీపీటీ’పైనే చర్చ.. అసలు ఏంటీ టూల్.. ఉపయోగాలేంటి.. ఆందోళన ఎందుకు?-what is chatgpt how can use it know the benefits and challenges full details about this ai chat bot ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  What Is Chatgpt How Can Use It Know The Benefits And Challenges Full Details About This Ai Chat Bot

ChatGPT: ప్రపంచమంతా ‘చాట్ జీపీటీ’పైనే చర్చ.. అసలు ఏంటీ టూల్.. ఉపయోగాలేంటి.. ఆందోళన ఎందుకు?

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 24, 2023 10:36 AM IST

What is ChatGPT: టెక్నాలజీ రంగంలో చాట్‍ జీపీటీ ఓ సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్‌బోట్ హాట్‍టాపిక్‍గా ఉంది. అయితే దుష్ప్రభావాలపైనా ఆందోళన ఉంది. అసలు చాట్ జీపీటీ ఏంటే ఏంటి.. దీని ఉపయోగాలు, ఎలా వినియోగించాలి, సవాళ్లు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

ChatGPT: ప్రపంచమంతా ‘చాట్ జీపీటీ’పైనే చర్చ.. అసలు ఏంటీ టూల్.. ఎలా పని చేస్తుంది.. లాభమెంత.. ఆందోళనలేంటి? (Photo: OpenAI)
ChatGPT: ప్రపంచమంతా ‘చాట్ జీపీటీ’పైనే చర్చ.. అసలు ఏంటీ టూల్.. ఎలా పని చేస్తుంది.. లాభమెంత.. ఆందోళనలేంటి? (Photo: OpenAI)

ChatGPT: “చాట్‍ జీపీటీ వాడడం ప్రారంభించిన దగ్గరి నుంచి నేను దానికి కొంత బానిసనయ్యా” అని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ ఇటీవల అన్నారు. అదానీ మాత్రమే కాదు ప్రపంచమంతా ప్రస్తుతం చాట్ జీపీటీ (ChatGPT) గురించే చర్చ జరుగుతోంది. లాంచ్ అయిన మూడు నెలల్లోనే మిలియన్ల మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నారు. దీంతో టెక్నాలజీ రంగంలో ఇదో సంచలనంగా మారింది. చాట్ జీపీటీని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ గూగుల్‍కు కూడా ఈ ఏఐ చాట్ బాట్ ‘చాట్ జీపీటీ’ సవాలు విసురుతోంది. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చిన ఈ చాట్ జీపీటీ టెక్ రంగంలో పెనుమార్పులకు కారణమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి.. ఎలా పని చేస్తుంది.. ఇంత పాపులర్ అయ్యేందుకు కారణాలేంటి.. దుష్ప్రభావాలు ఉన్నాయన్న ఆందోళనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

చాట్ జీపీటీ అంటే?

What is ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial intelligence - AI) సాయంతో పని చేసే అధునాతన చాట్‍బోటే ఈ ‘చాట్ జీపీటీ’ (ChatGPT). దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ (Chat Generative Pre Trained Transformer). అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్‍ జీపీటీ పని చేస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుంది. ఎందుకంటే ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటా బేస్ ఉంటుంది. డేటా బేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది.

ఎందుకంత పాపులర్ అయింది?

ChatGPT: 2022 నవంబర్‌లో లేటెస్ట్ చాట్ జీపీటీ-3 అందుబాటులోకి వచ్చింది. లాంచ్ అయిన మూడు రెండు నెలల్లోనే ప్రపంచమంతా పాపులర్ అయింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో సమగ్రంగా ఇస్తుంది. ఒకవేళ దేని గురించి అయినా గూగుల్‍లో సెర్చ్ చేస్తే చాలా లింక్స్ కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని అంతా క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అదే చాట్ జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది కూడా సింపుల్, కాన్వర్జేషన్ లాంగ్వేజ్‍లో వివరంగా సమాధానం చెప్పేస్తుంది. అందుకే చాట్ జీపీటీ అత్యంత వేగంగా పాపులర్ అయింది. కోట్లాది మంది దీన్ని ఇష్టపడుతున్నారు.

కోడింగ్ నుంచి వంటల వరకు..

Chat GPT: చాట్ జీపీటీ ఏ విషయంపై అయినా సమాధానాలు ఇస్తుంది. హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, మ్యాథమాటిక్స్, జనరల్ నాలెడ్జ్, పోగ్రామింగ్ లాంగ్వెజెస్, భాషలు, సాంస్కృతిక విషయాలు, ఆరోగ్యం, వంటకాలు, లైఫ్‍స్టైల్.. ఇలా ఒక్కేటేమిటి ఏ విషయాన్నైనా టెక్స్ట్ రూపంలో చాట్ జీపీటీని అడగవచ్చు. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇది సమాధానాలు ఇస్తుంది. గూగుల్‍ను అడిగినట్టుగానే ఈ చాట్ జీపీటీని ఏ క్వశ్చన్లు అయినా అడగవచ్చు. చాట్ జీపీటీ తన డేటా బేస్‍లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. మీరు ఈ చాట్‍ జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు. గ్రామర్ తప్పులను కూడా ఇది సరిదిద్దుతుంది. ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసిపెడుతుంది. సెంటెన్స్ లను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం 2021 వరకు సమాచారాన్ని చాట్‍ జీపీటీ కచ్చితంగా చెబుతోంది. 2022 నుంచి జరిగిన తాజా పరిణామాలు ఇంకా డేటా బేస్‍లో లేవు. త్వరలోనే అప్‍డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్‍కు చాట్ జీపీపీ కనెక్ట్ అయి లేదు. అయితే దీని డేటా బేస్‍లో చాలా సమాచారం ఉంటుంది కాబట్టి.. పూర్తి వివరాలను అందించగలదు.

ఎలా వాడాలి..

How to Use ChatGPT: ప్రస్తుతం చాట్ జీపీటీని వెబ్‍సైట్ ద్వారా వినియోగించవచ్చు. openai.com/blog/chatgpt వెబ్‍సైట్‍లో రిజిస్టర్ అయి చాట్ జీపీటీని వాడవచ్చు. రిజిస్టర్ అయ్యాక ప్రశ్నలను టెక్ట్స్ బాక్స్ లో ఎంటర్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రస్తుతం ఇది ఉచితం. అయితే సబ్‍స్క్రిప్షన్‍తో చాట్ జీపీటీ ప్రొఫెషనల్ వెర్షన్‍ను త్వరలో ఓపెన్ ఏఐ తీసుకురానుంది.

ఓపెన్ ఏఐ సంస్థ నుంచి..

ChatGPT: చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్ ఎన్‌‍జీవో ఇది. సామ్ ఆల్ట్‌మన్ (Salt Altman) 2015లో దీన్ని స్థాపించారు. స్టాండ్‍ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్‍అవుట్ అయిన ఆయన.. లూప్ట్ అనే సోషన్ నెట్‍వర్కింగ్ యాప్‍ను సృష్టించి, విక్రయంచారు. ఆ తర్వాత 2015లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేసేందుకు ఈ ఓపెన్ ఏఐను స్థాపించారు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ సృష్టించింది. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్, టెస్లా, లింక్‍డిన్ ప్రధాన ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా తప్పుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్.. ఓపెన్ ఏఐకు ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. 2020లో చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ… లాంచ్ చేసింది. అయితే ఓపెన్ఏఐ 3.2 వెర్షన్‍ను 2022 నవంబర్‌లో అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

గూగుల్‍కు సవాల్!

ChatGPT: చాట్ జీపీటీ ద్వారా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‍కు సవాల్ విసరాలని మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్టు సమాచారం. తమ సెర్చ్ ఇంజిన్ బింగ్‍ (BING)కు చాట్ జీపీటీని అనుసంధానం చేయాలని మైక్రోసాఫ్ట్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే గూగుల్ సెర్చ్ ఇంజిన్‍కు బింగ్ గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉందని అంచనా. అలాగే మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ ఎడ్జ్ లోనూ ఈ చాట్ జీపీటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్‍లకు కూడా చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసే పనిలో మైక్రోసాఫ్ట్ ఉంది.

ఆందోళనలు, భయాలు

ChatGPT: విద్యార్థుల విషయంలో చాట్ జీపీటీ పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ల హోం వర్కును ఈ చాట్ జీపీటీ సులభంగా చేసేస్తోంది. ఏదైనా ప్రశ్న ఎంటర్ చేస్తే చాలు మొత్తం సమాధానాన్ని వివరంగా ఇచ్చేస్తోంది. ఉదాహరణకు.. ఏదైనా మ్యాథమ్యాటిక్స్ ప్రశ్నను ఎంటర్ చేస్తే.. సొల్యూషన్‍ను పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపిస్తోంది. ఇసే రైటింగ్, గ్రామర్ తప్పులను కూడా ఇది పూర్తిగా సరిదిద్దేస్తోంది. సైన్స్ థియరీలు, హిస్టరీ ఇలా అన్ని ప్రశ్నలకు చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తోంది. దీనివల్ల విద్యార్థుల ఆలోచన శక్తిని చాట్ జీపీటీ తగ్గించేస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే పరీక్షల్లో చీట్ చేసేందుకు కూడా చాట్ జీపీటీ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళనలు ఉన్నాయి. విద్యార్థుల మేథోశక్తిని ఇది తగ్గించేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా న్యూయార్క్ లోని స్కూళ్లలో ఈ చాట్‍జీపీ టూల్ వాడకాన్ని నిషేధించారు.

సరైన పద్ధతిలో వినియోగిస్తే విద్యారంగానికి చాట్ జీపీటీ ఎంతో ఉపయోగపడుతుందన్న వాదనలు ఉన్నాయి. పిల్లలు విషయాలను సమగ్రంగా సులభంగా తెలుసుకునేందుకు చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. మంచి ఎడ్యుకేషన్ టూల్‍గా మారుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

సైబర్ దాడులకు..

సైబర్ దాడులు చేసే కేటుగాళ్లకు చాట్‍జీపీటీ ఆయుధంగా మారిందని తెలుస్తోంది. సైబర్ దాడులు చేసేందుకు నేరస్థులు కోడింగ్‍ను చాట్ జీపీటీ ద్వారా సులభంగా పొందుతున్నారని, దీంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతుందని కొన్ని టెక్నికల్ రీసెర్చ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ వెబ్‍సైట్లు, ఫేక్ ఈ-మెయిల్స్ అధికమవుతాయని హెచ్చరిస్తున్నాయి. అయితే చాట్ జీపీటీకి ఓపెన్ ఏఐ క్రమంగా కొన్ని మార్పులను చేస్తోంది. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానాలను నిరాకరించే విధంగా డెవలప్ చేస్తోంది. సవాళ్లను అధికమిస్తే టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అద్భుతమైన ఆవిష్కరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.