కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్​ బిల్లు- భారతీయులపై ప్రభావం ఎంత?-what is canada new citizenship bill c 3 and how will it impact indians ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్​ బిల్లు- భారతీయులపై ప్రభావం ఎంత?

కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్​ బిల్లు- భారతీయులపై ప్రభావం ఎంత?

Sharath Chitturi HT Telugu

కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ లీనా మెట్లెజ్ డయాబ్ ప్రవేశపెట్టిన సీ-3 బిల్లును భారత సమాజం సహా వలసదారులు స్వాగతిస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం కెనడా వెలుపల కెనడా తల్లిదండ్రులకు జన్మించిన పౌరులకు కూడా పౌరసత్వం లభిస్తుంది!

కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్​ బిల్లు (Pixabay/Representational)

కెనడా తన ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సీ-3 బిల్లు.. సంతతి అందించే పౌరసత్వంపై పరిమితిని తొలగిస్తుంది. ఈ మేరకు కొత్త బిల్లును ఆ దేశ ఇమ్మిగ్రేషన్​ మినిస్టర్​ లీనా మెట్లెజ్​ డయాబ్​ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లును భారతీయ సమాజం సహ అనేక మంది వలసదారులు స్వాగతిస్తున్నారు.

కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్​ బిల్లులో ఏముంది?

ప్రస్తుత రూల్స్​ ప్రకారం.. కెనడా వెలుపల పుట్టిన ఆ దేశ పౌరుడు.. తమ సంతతికి, సిటిజెన్​షిప్​ని ఇవ్వలేడు. 2009లో ప్రవేశపెట్టిన ఈ నియమం పౌరసత్వాన్ని మొదటి తరానికే పరిమితం చేసింది. తాజా ప్రతిపాదిత బిల్లు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది.

కానీ ఇలా జరగాలంటే తల్లిదండ్రులు కెనడాతో సంబంధాన్ని ధ్రువీకరించుకోవాలి. అంటే, బిడ్డ పుట్టే ముందు- లేదా దత్తత తీసుకునే ముందు తల్లిదండ్రులు కనీసం 1095 రోజులు (3ఏళ్లు) కెనడాలో భౌతికంగా జీవించి ఉండాలి.

ఐఆర్​సీసీ (ఇమ్మిగ్రేషన్​, రెఫ్యూజీ, సిటిజెన్​షిప్​ కెనడా) ప్రకారం.. “ఇప్పటివరకు ఉన్న మొదటి తరం పౌరసత్వం రూల్​ అనేది కెనడా కుటుంబాలను ఇక ఏమాత్రం ప్రతిబింబించడం లేదు.”

కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్​ బిల్లుతో భారత సమాజంతో పాటు ఇతర వలసదారుల సమాజాలకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రవేశపెడుతున్న కఠిన రూల్స్​ మధ్య, కెనడా ఇప్పుడు నిబంధనలను సవరిస్తుండటం ఊరటను ఇచ్చే విషయం. హెచ్​-1బీ, ఎఫ్​-1 వీసాలపై అమెరికాలో ఉంటున్న వారికి పుట్టిన బిడ్డలకు పౌరసత్వాన్ని రద్దు చేశారు ట్రంప్​.

బిల్లును స్పష్టంగా చెప్పాలంటే.. కెనడా పౌరులు లేదా కెనడాలో పూర్వికులు ఉండి, భారత దేశంలో పుట్టిన వారికి కూడా ఇప్పుడు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది.

“ఈ సీ-3 బిల్లు ప్రస్తుత నిబంధనల్లో లోపాలు, తప్పులను సరిచేస్తుంది. కానీ ఇమ్మిగ్రేషన్​పై కెనడా ప్రజల ప్రస్తుత అభిప్రాయాల నేపథ్యంలో దీనికి కాస్త వ్యతిరేకత ఎదురవ్వొచ్చు,” అని ఇమ్మిగ్రేషన్​ మినిస్టర్​ అభిప్రాయపడ్డారు.

కెనడా కొత్త బిల్లుకు ఆమోదం లభించి, అది చట్టంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

“పార్లమెంట్​లోని రెండు సభల్లో ఆమోదం లభించి, రాయల్​ ఆమోదం కూడా వస్తే.. ఇందులోని నిబంధనలను త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తాము,” అని ఐఆర్​సీసీ తెలిపింది.

కెనడా పార్లమెంట్​లో ఒక బిల్లు రెండు సభల్లో ఓటింగ్​కి వెళ్లే ముందు 3 రీడింగ్స్​ పాస్​ అవ్వాలి. ఆ తర్వాత హౌస్​లో ఓట్లు వేస్తారు. అక్కడ బిల్లు పాసైన తర్వాత రాయల్​ గవర్నర్​ జనరల్​ ఆమోదం ఇవ్వాలి. ఆ తర్వాత అది చట్టంగా మారుతుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.