Indian nurse in Yemen: యెమెన్ లో మరణశిక్ష పడిన భారతీయ నర్స్ ను కాపాడేగలిగేది ‘బ్లడ్ మనీ’ మాత్రమే; ఏమిటీ బ్లడ్ మనీ?
Blood money: భారత సంతతికి చెందిన నర్సు నిమిషా ప్రియ కు హత్య కేసులో యెమన్ లో మరణశిక్షపడింది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ఆమె కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు. అయితే, ఇప్పుడు నిమిషా ప్రియను కాపాడగలిగేది బ్లడ్ మనీ’ మాత్రమేనని యెమెన్ చట్టాలపై అవగాహన ఉన్న నిపుణులు చెబుతున్నారు.
Blood money: యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో మరణశిక్ష విధించారు. 2018లో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఆమెకు విధించిన మరణశిక్షకు ఇటీవల యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అమిని నుంచి ఆమోదం లభించింది. నెలరోజుల్లో ఆమెకు ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది.
బ్లడ్ మనీ మాత్రమే..
ఈ సమయంలో నిమిషా ప్రియను మరణశిక్ష నుండి బయటపడేసేందుకు ఒకే ఒక అవకాశం ఉంది. అదే బ్లడ్ మనీ. దానినే ఇస్లామిక్ షరియా చట్టంలో 'దియ్యా' అని కూడా పిలుస్తారు. యెమెన్ లో షరియా చట్టం అనుసరిస్తారు. ఈ చట్టంలో హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులు, తమకు శిక్షను తప్పించాలని వేడుకుంటూ బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారాన్ని అందిస్తారు. దీనినే 'దియ్యా' అంటారు. ఈ విధానంలో మరణశిక్ష వంటి కఠిన శిక్షలను నివారించడానికి, దోషులకు క్షమాభిక్ష ప్రకటించడానికి బదులుగా బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారాన్ని (Blood money) అందిస్తారు.
బాధిత కుటుంబం చేతిలో నిర్ణయం
ఈ వ్యవస్థ నేరస్థుడి భవితవ్యాన్ని బాధిత కుటుంబం చేతిలో పెడుతుంది. దోషిని శిక్ష నుంచి తప్పించి, క్షమాబిక్ష పెట్టే అధికారం కేవలం బాధిత కుటుంబానికే ఉంటుంది. అయితే, అందుకు దోషి కుటుంబ సభ్యులు బాధిత కుటుంబానికి కొంత డబ్బును ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎంత అనేది షరియా చట్టంలో నిర్దిష్టంగా లేదు. అందువల్ల బాధిత కుటుంబం నిర్ణయించేదే ఆ మొత్తం అవుతుంది. అందుకు దోషి కుటుంబం బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపి, తాము చెల్లించగల డబ్బు తీసుకోవడానికి వారిని ఒప్పించాల్సి ఉంటుంది.
ఖురాన్ లో ఇలా ఉంది..
ఇస్లాం ప్రధాన మత గ్రంథమైన ఖురాన్ దియ్యాపై ఇలా చెబుతుంది, "ఓ విశ్వాసులారా! హత్య కేసుల్లో ప్రతీకార నియమం మీకోసం ఏర్పాటు చేయబడింది. స్వేచ్ఛాయుత పురుషుడికి ఒక స్వేచ్చాయుత పురుషుడు, బానిసకు బానిస, స్త్రీకి ఒక స్త్రీ. అయితే నేరస్థుడిని బాధితురాలి సంరక్షకులు క్షమిస్తే, రక్తపు డబ్బును నిష్పాక్షికంగా నిర్ణయించాలి. మర్యాదపూర్వకంగా చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి లభించిన రాయితీ మరియు కరుణ. దీనిని ఆ తరువాత ఎవరు అతిక్రమించినా బాధాకరమైన శిక్ష అనుభవించబడుతుంది" (సూరా అల్-బఖారా, వచనం 178).
ప్రభుత్వ సాయం కోరిన నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు
నిమిషా ప్రియను కాపాడేందుకు తాము డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె కుటుంబం తెలిపింది. మరణశిక్ష నుంచి ఆమెను కాపాడేందుకు బాధితుడైన తలాల్ అబ్దో మహ్దీ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మహ్దీ కుటుంబంతో సంప్రదింపులు ప్రారంభించడానికి సహాయం చేయాలని నిమిషా కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. ‘‘మహ్దీ కుటుంబంతో చర్చలు జరిపి, నిమిషా ప్రియను క్షమించమని ఒప్పించి, ఆమెను విడిపించే అవకాశం ఉంది. బాధిత కుటుంబాన్ని గుర్తించి చర్చల కోసం వారిని ఒప్పించడానికి భారత ప్రభుత్వం సహాయపడుతుంది" అని ఢిల్లీ హైకోర్టులో ప్రియా తల్లి ప్రేమ కుమారి తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ చంద్రన్ అన్నారు.'సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' బ్లడ్ మనీ ఏర్పాటుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటుందని తెలిపారు. నిమిషా ప్రియ విడుదల కోసం నిధుల సమీకరణ కోసం 2020లో ఈ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.