Delhi elections: ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా?.. విశ్లేషణ-what if aap and congress had joined forces against bjp in delhi elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Elections: ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా?.. విశ్లేషణ

Delhi elections: ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా?.. విశ్లేషణ

Sudarshan V HT Telugu
Published Feb 08, 2025 06:42 PM IST

Delhi assembly elections results analysis: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైంది. 40 కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించనుంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ లు వేరువేరుగా కాకుండా, కలిసి పోటీ చేసి ఉంటే, బీజేపీని నిలువరింగలిగేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా?
ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా? (PTI)

Delhi assembly elections results analysis: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.ఈ రెండు పార్టీలు లోక్ సభ ఎన్నికల సమయంలో ఏర్పడిన విపక్ష కూటమి ‘ఇండియా’ లో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.

కలిసి పోటీ చేస్తే..

ఆప్, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేస్తే, చాలా స్థానాల్లో బీజేపీని ఓడించగలిగేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదాహరణకు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కు కేజ్రీవాల్ కన్నా సుమారు 4 వేలు ఓట్లు ఎక్కవ వచ్చాయి. అదే స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సందీప్ దీక్షిత్ కు 4,568 ఓట్లు పోలయ్యాయి. అంటే, ఒకవేళ, కాంగ్రెస్, ఆప్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈ స్థానంలో బీజేపీ విజయం సాధించలేకపోయేది.

కాంగ్రెస్ అభ్యర్థుల ప్రభావం

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కంటే కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు కలిసి మెరుగ్గా రాణించారు. వాస్తవానికి దాదాపు పది చోట్ల కాంగ్రెస్ కు బీజేపీ గెలుపు గెలిచిన మార్జిన్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఉదాహరణకు,

  • జంగ్ పురాలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ మార్వా ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా పై కేవలం 675 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫర్హాద్ సూరికి 7,350 ఓట్లు వచ్చాయి.
  • గ్రేటర్ కైలాష్ లోనూ బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ మెజారిటీ 3,188 ఓట్లు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి గర్వి సింఘ్వీకి 6,711 ఓట్లు వచ్చాయి. ఈ సీటు నుంచి ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ఓడిపోయారు.
  • కస్తూర్బా నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా 11 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ స్థానంలో మూడో స్థానంలో నిలిచిన ఆప్ అభ్యర్థి రమేశ్ పహల్వాన్ కు 18,617 ఓట్లు వచ్చాయి.

ఆప్+ కాంగ్రెస్ > బిజెపి

ఐక్య ఆప్-కాంగ్రెస్ ఫ్రంట్ బిజెపి వ్యతిరేక ఓట్లను సంఘటితం చేసి, ఓటమిని నివారించగలిగేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45.81 శాతం ఓట్లను సాధించింది. ఆప్ కు 43.5 శాతం, కాంగ్రెస్ కు 6.36 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ కలిసి (సుమారు 50 శాతం) బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించాయని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, సంఖ్య పరంగా చూస్తే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 లో బీజేపీ 48 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 21 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మళ్లీ ఖాళీ అయింది. గత రెండు ఎన్నికల్లో ఆప్ 2020లో 62 సీట్లు, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుంది.

వేర్వేరుగా పోటీ..

కాంగ్రెస్, ఆప్ లు జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’లో భాగస్వాములు. కానీ ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు 2025 ఢిల్లీ ఎన్నికల్లో వేర్వేరు దారులు ఎంచుకున్నాయి. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ మధ్య వైరం ఉన్న చరిత్ర ఉంది. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాలన కారణంగా కాంగ్రెస్ పార్టీ క్షీణించినప్పటికీ ఇప్పటికీ కొంత ప్రభావం ఉంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.