పశ్చిమ బెంగాల్ పోలీసులు జరిపిన దాడిలో సౌత్ 24 పరగణాస్‌లోని బంగారం స్మగ్లర్ ఇంట్లో సొరంగాన్ని కనుగొన్నారు. నకిలీ బంగారు విగ్రహాలను వినియోగదారులకు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్తుండగా ఇది కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నదియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి నకిలీ బంగారు విగ్రహాల విక్రయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన పోలీసులకు సద్దాం సర్దార్, అతని సహచరులు ఈ పని చేస్తున్నారని గుర్తించారు. వీరంతా స్మగ్లర్లు. పోలీసుల దాడిలో తప్పించుకునే మార్గంగా సొరంగం ఉపయోగించేవారు. నకిలీ బంగారు విగ్రహాలు, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి డెలివరీ చేయకపోవడంపై ఖాతాదారుల నుంచి పలు ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు జరిగాయి.
సద్దాం సర్దార్, అతని సోదరుడు సైరుల్ అనే ఇద్దరు వ్యక్తులపై తమకు ఫిర్యాదు అందిందని అధికారులు తెలిపారు. నదియాకు చెందిన ఓ వ్యక్తి రూ. 12 లక్షలు మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. నకిలీ బంగారు విగ్రహాలను చూపించి వ్యక్తిని బుట్టలో వేసుకున్నారు. వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు బరుయ్‌పూర్ ఎస్పీ పలాష్ చంద్ర ధాలీ తెలిపారు.
జూలై 15న సద్దాం సర్దార్ సౌత్ 24 పరగణాస్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. అయితే ఒక గుంపు కుల్తాలి పోలీస్ స్టేషన్‌లోని పోలీసు బృందంపై దాడి చేసి నిందితులను తప్పించుకోవడానికి సహాయం చేసింది.
నివేదికల ప్రకారం సద్దాం సోదరుడు సైరుల్, ఇతర కుటుంబ సభ్యులు పోలీసు అధికారులతో ఘర్షణకు దిగారు. రైడింగ్ బృందంపై దాడి చేయడానికి ఆ వ్యక్తి ముఠాను ప్రేరేపించాడు. దీంతో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. సైరుల్ పోలీసులను భయపెట్టడానికి, అతని సోదరుడు తప్పించుకోవడానికి సహాయం చేయడానికి గాలిలోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసు బృందంపై దాడి జరిగిన తర్వాత సైరుల్ కూడా తప్పించుకోగలిగాడు.
దాడి తరువాత పోలీసు బృందం వెనుదిరిగింది. కానీ అదే రోజు సాయంత్రం నిందితుల ఇంటికి వెళ్లారు పోలీసులు. ఈ నడుము లోతు నీరు ఉన్న సొరంగాన్ని కనుగొన్నారు. 40 మీటర్ల పొడవైన సొరంగం ఇటుకలతో 8 నుండి 10 అడుగుల లోతులో ఉంది. ఇది దాదాపు 5-6 అడుగుల ఎత్తు, 4-5 అడుగుల వెడల్పు ఉంటుందని పోలీసులు తెలిపారు. సొరంగం 40 మీటర్ల పొడవుతో మాల్టా నది, సుందర్‌బన్ డెల్టాకు కలుపుతుందని పోలీసులు తెలిపారు. ఈ రెండు నీటి వనరులు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి.
సోదరులిద్దరూ వినియోగదారులకు నకిలీ బంగారు విగ్రహాలను విక్రయిస్తున్నారని తెలిసింది. వారు సోషల్ మీడియాను ఉపయోగించి వినియోగదారులను ఆకర్షించి వారికి తగ్గింపు ధరలకు బంగారు విగ్రహాలను అందిస్తున్నట్టుగా నాటకమాడారు. ఆ విగ్రహాలు నకిలీవని, మోసపోయామని కస్టమర్లు ఆ తర్వాతే గుర్తించారు.
రైడింగ్ బృందంపై దాడికి పాల్పడినందుకు సద్దాం భార్య మసుదా సర్దార్, సైరుల్ సర్దార్ భార్య రబేయా సర్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సద్దాం, అతని సోదరుడిని పట్టుకోవడానికి సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ ఈ మొత్తం వ్యవహారాన్ని జాతీయ భద్రత ఆందోళనగా పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధత పాటించాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరారు.