Buddhadeb Bhattacharya Death : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి
Buddhadeb Bhattacharya : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య 80 సంవత్సరాల వయస్సులో కోల్‌కతాలో కన్నుమూశారు. భట్టాచార్య చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇటీవలి కాలంలో అనేకసార్లు ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ మరణ వార్తను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ధృవీకరించారు. ఇటీవలి సంవత్సరాలలో మాజీ ముఖ్యమంత్రి తన ఆరోగ్య సమస్యల కారణంగా ప్రజా జీవితం నుండి వైదొలిగారు. బుద్ధదేవ్ భట్టాచార్య 2015లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ నుండి వైదొలిగారు. ఆ తర్వాత 2018లో రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యత్వాన్ని వదులుకున్నారు.
కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. చూపు కూడా మందగించింది. బుద్ధదేవ్ భట్టాచార్య నవంబర్ 2000 నుంచి మే 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. బెంగాల్ సీఎంగా చేసినా.. దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఒక చిన్న రెండు గదుల ప్రభుత్వ అపార్ట్‌మెంట్లో ఆయన నివాసం ఉండేవారు.
2000 సంవత్సరంలో పార్టీ సీనియర్ నేత జ్యోతిబసు నుంచి బద్ధదేవ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందిగ్రామ్, సింగూరు కాల్పులు జరిగాయి.
గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన భార్య మీరా సోదరి ఇరా బసు భిక్షమెత్తుకుంటున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. భట్టాచర్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె టీచర్‌గా పని చేసేది. తర్వాత కొంతకాలానికి ఆమె పరిస్థితి తారుమారైంది. బుద్ధదేవ్ భట్టాచార్య కూడా సాధారణ జీవితం గడిపేవారు. కిందటి ఎన్నికల్లో ఆయన ఏఐ వీడియోను సీపీఎం ఉపయోగించుకుంది. ఏఐ సాయంతో బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్‌ను తయారు చేసి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసింది కమ్యూనిస్టు పార్టీ.
టాపిక్