Weather update : తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- ఐఎండీ అలర్ట్..
Weather update : గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణలో జూలై 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవాల్లో పగటి పూట భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తూ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
“నైరుతి ద్వీపకల్ప భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
జూలై 16 వరకు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జూలై 12న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తూర్పు, ఈశాన్య భారతంలో వాతావరణ అంచనాలను పరిగణనలోకి తీసుకున్న వాతావరణ శాఖ జూలై 16 వరకు అసోం, మేఘాలయ, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పశ్చిమబెంగాల్, సిక్కిం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం ఝార్ఖండ్ రాష్ట్రంలో పగటిపూట భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు నాగాలాండ్, మణిపూర్ లలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయి.
వాయవ్య, మధ్య భారతంలో జూలై 16 వరకు, ఛత్తీస్‌గఢ్‌లో జూలై 15 వరకు, మధ్యప్రదేశ్‌లో జూలై 14 వరకు, హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 13 వరకు, రాజస్థాన్‌లో జూలై 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ బులెటిన్ పేర్కొంది. రానున్న నాలుగు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రానున్న నాలుగు రోజుల్లో జమ్ముకశ్మీర్-లడఖ్-గిల్గిట్-బాల్టిస్థాన్-ముజఫరాబాద్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దేశ రాజధాని దిల్లీ ప్రజలు శనివారం ఉదయం భారీ వర్షంతో మేల్కొన్నారు. మరోవైపు జూలై 13 తెల్లవారుజామున, ఆర్థిక రాజధానిని వర్షాలు ముంచెత్తాయి. ముంబైలోని ఈస్టర్న్ హైవే ప్రాంతం తడిసి ముద్దైంది.
ద్రోణి ప్రభావంతో..
వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో ఇవాళ(జులై 13) మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం