Protect Crops : అధిక వర్షాల నుంచి పంటల సంరక్షణకు చేపట్టాల్సిన పద్ధతులు.. రైతులకు సలహాలు
Protect Crops From Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్నదాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. విపరీతమైన వానలతో పంటలు దెబ్బతింటున్నాయి. అయితే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను సంరక్షించుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వానలు ఎక్కువగా పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పంటలు నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టి పంటలను రక్షించుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి చెప్పిన రైతులకు ఉపయోగపడే ఆ పద్ధతులు ఏంటో చూద్దాం...
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగు నీటిని తీసివేయాలి. రాబోయే రెండు రోజులలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి.
వరి పంటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశలో ఉంది. బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు ఆశించే అవకాశం ఉంది. రైతులు 0.2 గ్రాములు ప్లాంటమైసిన్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే కాండం కుళ్ళు రావడానికి కూడా అవకాశం ఎక్కువ అందుకే.. 2. 5 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును లేదా ఒక మిల్లీలీటరు మైసిన్ వాలిడామైసిన్ కానీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అగ్గి తెగులు కూడా రావడానికి అవకాశం ఎక్కువ.
తెగులు గమనించినట్లయితే 0.6 గ్రాముల ట్రై సైక్లోజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండో దఫా యూరియాని వేసుకోవడానికి అనుకూలమైన సమయం. తెగులు గనుక ఆశించి ఉన్నట్లయితే నత్రజని మోతాదుకు మించి ఉపయోగించకూడదు.. లేదా వేసుకోవడం వాయిదా వేసుకోవాలి.
పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పత్తికి వాడాలి. మొక్కల మొదళ్ళకు 7-10 సెం.మీ దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పాలి. ముంపునకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 లేదా 13-0-45 లేదా 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పిండి నల్లి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు నివారించేందుకు 3 గ్రాముల కాపర్-ఆక్సి-క్లోరైడ్ పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఆల్టర్నేరియా.. ఆకు మచ్చ తెగులు కోసం 2. 5 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
మొక్కజొన్నకు పాటించాల్సిన పద్ధతులు
అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్ని ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పంట.. మోకాలు ఎత్తు వరకు ఉంది. వర్షాలు నిలిచిన తర్వాత మోకాలు ఎత్తు దశలో ఉన్నా పంటకు 5 గ్రాముల 19-19-19 లేదా 20 గ్రాముల డీఏపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్‌ను వేసుకోవాలి. బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ ఉంది. కత్తెర పురుగును కూడా ఉండి.. అవసరమైనట్లయితే 0.3 మిల్లీ లీటర్ల క్లోరైంటిని పోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
గమనిక : రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రందించండి. వారు చెప్పిన పద్ధతలను ఫాలో అవ్వండి.