Wayanad landslides : వయనాడ్లో ఘోర విపత్తుకు అసలు కారణం ఏంటి?
కేరళలో తరచూ కొండచరియలు విరిగిపడటానికి ఈ ప్రాంతంలో అధిక మైనింగ్, అటవీ నిర్మూలన సహా వాతావరణ మార్పుల ప్రభావాలు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు వయనాడ్ విపత్తులో మృతుల సంఖ్య 130 దాటింది!
కేరళలోని వయనాడ్లో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర విపత్తులో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 130కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. 200కుపైగా మంది గాయపడ్డారు. అనేక మంది గల్లంతయ్యారు. అసలు ఈ స్థాయిలో ప్రకృతి ప్రకోపానికి కారణం ఏంటి? అంటే వాతావరణ మార్పులే అని నిపుణులు చెబుతున్నారు.
కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడటానికి అధిక మైనింగ్, ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం, వాతావరణ మార్పుల ప్రభావం కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారతదేశంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లాల్లో వయనాడ్ 13వ స్థానంలో ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023 లో విడుదల చేసిన ల్యాండ్స్లైడ్ అట్లాస్ ప్రకారం కొండచరియలు విరిగిపడే 30 జిల్లాల్లో 10 ఒక్క కేరళలోనే ఉండటం గమనార్హం.
పచ్చదనాన్ని కోల్పోవడం..
కేరళ కొండచరియలు ప్రధానంగా తోటల ప్రాంతాల్లో సంభవించాయని 2021 అధ్యయనం తెలిపింది. 56 శాతం ప్లాంటేషన్ ప్రాంతాల్లోనే కొండచరియలు విరిగిపడ్డాయని అధ్యయనంలో తేలింది. 2022 అధ్యయనం ప్రకారం, 1950 నుంచి 2018 మధ్య వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో 62 శాతం అటవీ ప్రాంతం కనుమరుగైంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, 1950ల వరకు, వయనాడ్ మొత్తం విస్తీర్ణంలో 85 శాతం అటవీ ప్రాంతం ఉండేది. అది ప్రతియేటా తరిగిపోతూ వస్తోంది.
అరేబియా సముద్రం కూడా కారణమేనా?
అరేబియా సముద్రం వేడెక్కడం రాష్ట్రంలో అత్యంత భారీ, అనూహ్య వర్షపాతానికి ఒక కారణమని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్) లోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ పేర్కొన్నారు.
ఆగ్నేయ అరేబియా సముద్రం వెచ్చగా మారుతోందని, దీనివల్ల కేరళ సహా ఈ ప్రాంతంపై వాతావరణం అస్థిరంగా మారుతోందని తమ పరిశోధనలో తేలిందని ఎస్.అభిలాష్ తెలిపారు.
2019 కేరళ వరదల తర్వాత డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ట్రెండ్ కనిపిస్తోందని అభిలాష్ తెలిపారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేఘ వ్యవస్థలు తక్కువ సమయంలో అతి భారీ వర్షాలకు కారణమవుతాయని, ఇది కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.
పర్యావరణ నిర్లక్ష్యం, మైనింగ్..
వయనాడ్ పర్వత శ్రేణులను పర్యావరణపరంగా సున్నితమైనవిగా ప్రకటించాలని పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ' పేర్కొంది. అత్యంత సున్నితమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, విచ్చలవిడిగా జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని ప్యానెల్ పేర్కొంది.
పర్యావరణపరంగా సున్నితమైన జోన్ 1గా పరిగణించే ఈ ప్రాంతంలో మైనింగ్, క్వారీయింగ్, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున పవన విద్యుత్ ప్రాజెక్టులను నిషేధించాలని సిఫార్సు చేశారు.
భారీ వర్షాలు కొనసాగుతాయి..!
వయనాడ్ విపత్తుతో ఉలిక్కిపడిన కేరళకు మరో చేదు వార్త! రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
సంబంధిత కథనం