Wayanad bypoll : ప్రియాంక గాంధీ ప్రభంజనం! లక్షకుపైగా మెజారిటీతో విజయం దిశగా..
వయనాడ్ లోక్‌సభ సీటు ఉప ఎన్నిక సమరంలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రభంజనం కొనసాగుతోంది. సమీప ప్రత్యర్థిపై ఆమె 1 లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
కేరళ వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభంజన సృష్టించనున్నారు! పోటీ చేస్తున్న తొలి ఎన్నికలో ప్రియాంక హవా కొనసాగుతోంది. సోదరుడు రాహుల్ గాంధీ విడిచిపెట్టిన సీటు నుంచి ప్రియాంక గాంధీ లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ హవా..
ఈసీ లెక్కల ప్రకారం శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన రెండు గంటల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీకి చెందిన సత్యన్ మొకేరిపై 1,01,743 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. కౌంటింగ్ ప్రారంభానికి గంట ముందే ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచారు.
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్, వామపక్షాల అభ్యర్థి సత్యన్ మోకేరి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు.
రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం ఖాళీ..
తన సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన స్థానం నుంచి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థిగా వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ లోక్ తన వయనాడ్ సీటును ఖాళీ చేశారు.
వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ గెలిస్తే గాంధీ కుటుంబం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన మూడో వ్యక్తిగా నిలుస్తారు.
వయనాడ్‌లో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే ఎన్డీయేను ఎన్నుకోవాలని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ చేసిన ప్రచారాలు విఫలం అయ్యాయని స్పష్టమవుతోంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఇలా..
మరోవైపు మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూసుకెళుతోంది. శనివారం ఉదయం 10:20 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 205 సీట్లల్లో ఆధిక్యంలో ఉండి, మెజారిటీ మార్క్ (145)ని దాటేసింది. విపక్షం మాత్రం 67 చోట్ల లీడింగ్‌లో ఉండిపోయింది.
ఇక ఝార్ఖండ్‌లో రసవత్తరపోరు కనిపిస్తోంది! ఉదయం నుంచి లీడింగ్‌లో ఉన్న ఎన్డీఏ కూటమిని జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి హఠాత్తుగా వెనక్కి నెట్టేసింది! ప్రస్తుత సమాచారం ప్రకారం.. జేఎంఎం 46 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ కూటమి 32 చోట్ల లీడింగ్‌లో ఉంది.
81 సీట్లున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మార్క్ 41.
సంబంధిత కథనం