Wi-Fi In Flight : విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఈ ఫ్లైట్‌లో ఇక వైఫై.. మెుదటి 20 నిమిషాలు ఫ్రీ
Wi-Fi In Flight : విమాన ప్రయాణికులకు శుభవార్త. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా విమానాల్లో Wi-Fi సేవలను అందించనుంది. ఈ సమాచారాన్ని కంపెనీ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

విమాన ప్రయాణికులకు మంచి వార్త. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా విమానాల్లో Wi-Fi సర్వీస్ అందించనుంది. ఈ సమాచారాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. భారతీయ విమానయాన రంగంలో తొలిసారిగా, విస్తారా ఇప్పుడు తన అంతర్జాతీయ విమానాల్లో మెుదటి 20 నిమిషాల ఉచిత Wi-Fiని అందించనున్నట్లు తెలిపింది. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A321neo ఎయిర్‌క్రాఫ్ట్ అన్ని క్యాబిన్ కేటగిరీలలో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. దీంతో భారతదేశంలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థగా విస్తారా నిలిచింది. ప్రయాణికులు తమ డెబిట్/క్రెడిట్ కార్డును ఉపయోగించి సేవను పొందే అవకాశం ఉంటుంది.
'35000 అడుగుల వద్ద కూడా ముఖ్యమైన అప్‌డేట్స్ మిస్ చేయవద్దు. భారతీయ ఏవియేషన్‌లో తొలిసారిగా విమానంలో 20 నిమిషాల ఉచిత Wi-Fiని పొందండి. ఇప్పుడు మీరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రెడిట్ కార్డ్‌లతో పాటు భారతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి మీరు ఎంచుకున్న ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.' అని కంపెనీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయాణికులు తమ ఇమెయిల్ చిరునామా రిజిస్టర్ చేయాలి. వారి బ్యాంక్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోవాలి. OTP ధృవీకరణ తర్వాత ఈ సేవను ఉపయోగించవచ్చు. వైఫై సౌకర్యాన్ని అందిస్తున్న తొలి భారతీయ విమానయాన సంస్థగా విస్తారా అవతరిస్తుంది.
విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రాజావత్ మాట్లాడుతూ 'విస్తారాలో మా కస్టమర్ అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాం. అన్ని క్యాబిన్‌లలో అంతర్జాతీయ విమానాలలో ఉచిత Wi-Fiని అందించే మొదటి భారతీయ విమానయాన సంస్థగా మరోసారి అగ్రగామిగా నిలిచినందుకు మేం సంతోషిస్తున్నాం. కస్టమర్‌లు తమ విస్తారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, విలాసవంతంగా చేయాలనే లక్ష్యంతో ఇది తీసుకొచ్చాం.' అని పేర్కొన్నారు.
విస్తారా అంతర్జాతీయ విమానాలు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇది వారి టైర్ లేదా క్యాబిన్ క్లాస్‌తో సంబంధం లేకుండా క్లబ్ విస్టా సభ్యులందరికీ ఉచిత చాట్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఇతర ప్రయాణీకులకు WhatsApp, Facebook Messenger వంటి యాప్‌లలో అపరిమిత సందేశాల కోసం రూ. 372.74 ప్లస్ GSTతో లభిస్తుంది.
సోషల్ మీడియా, వెబ్ కంటెంట్ కోసం పొందుపరిచిన ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌తో సహా విమానంలో ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఎయిర్‌లైన్ రూ. 1577.54తో ప్లస్ GSTని వసూలు చేస్తుంది. కస్టమర్‌లు రూ. 2707.04 ప్లస్ GSTతో తీసుకుంటే అపరిమిత డేటాను పొందవచ్చు.
టాపిక్