CCTV camera on daughter’s head: భద్రత కోసం కూతురి తలపై సీసీ టీవీ కెమెరా అమర్చిన తండ్రి
పాకిస్తాన్ కు చెందిన ఓ తండ్రి తన కుమార్తె భద్రత కోసం ఆమె తలపై సీసీ కెమెరాను అమర్చడం సంచలనంగా మారింది. కరాచీలో ఇటీవల జరిగిన ఓ విషాద ఘటన మహిళల భద్రతపై ఆందోళన రేకెత్తించిన నేపథ్యంలో ఆ తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఓ పాకిస్థానీ వ్యక్తి తన కుమార్తె భద్రత కోసం వినూత్న, అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఆమె తలపై సీసీ కెమెరాను అమర్చాడు. ఇది కొంత అసౌకర్యమే అయినప్పటికీ, తన కూతురి భద్రత కోసం తప్పడం లేదని చెబుతున్నారు. ఈ వింత మానిటరింగ్ టెక్నిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహిళలపై దాడులు..
పాకిస్థాన్ లో మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తన కూతురి భద్రత గురించి ఒక తండ్రి పడే ఆందోళన ఈ అసాధారణ చర్యలో స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రులు తమ కూతుళ్లు భద్రంగా ఉండాలని కోరుకోవడం సర్వసాధారణం అయితే, ఈ పాకిస్తానీ తండ్రి మాత్రం తన కుమార్తె రక్షణ కోసం ఆమె తలకు సీసీ టీవీ కెమెరాను అమర్చి, కొత్త ట్రాకింగ్ సిస్టమ్ ను ప్రారంభించాడు. ఈ అసాధారణ చర్య ఆమె భద్రత పట్ల అతని నిబద్ధతను తెలియజేస్తుంది.
వైరల్ వీడియో
తలపై సీసీ టీవీ కెమెరా అమర్చి ఉన్న ఒక యువతిని మరొకరు ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, తన కదలికలను ట్రాక్ చేయడానికి తన తండ్రి ఈ కెమెరాను ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. మీ తండ్రి ఇలా తలపై కెమెరాను ఇన్ స్టాల్ చేయడంపై మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా? అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగ్గా, ఆమె అలా చేయలేదని సమాధానమిచ్చింది. తన తండ్రి తన భద్రత కోసమే అలా చేశారని చెప్పారు. తన తండ్రి తనకు సెక్యూరిటీ గార్డు అని, అతను కెమెరా సహాయంతో తనను పర్యవేక్షిస్తాడని ఆ యువతి అంగీకరించింది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
కరాచీలో ఇటీవల ఒక యువతిపై దాడి చేసి ఆమెను చంపేశారు. దీంతో తన కూతురి భద్రత కోసం ఈ యువతి తండ్రి ఈ వినూత్న ఆలోచన చేశారు. ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో 'నెక్ట్స్ లెవల్ సెక్యూరిటీ' అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. దీనికి దాదాపు 17కె వ్యూస్ రాగా, పలువురు యూజర్లు కామెంట్ సెక్షన్ లో తమ ఫీడ్ బ్యాక్ ను షేర్ చేశారు. 'ఇట్నా డిజిటల్ భీ ని హోనా థా (ఇంతగా డిజిటల్ కావాల్సిన అవసరం లేదు)' అని ఓ యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. 'షీసీటీవీ కెమెరా' అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘పీఛే సే మారేగా తో నహీ దిఖేగా నా’’ (ఎవరైనా మిమ్మల్ని వెనుక నుండి దాడి చేస్తే ఈ కెమెరాలో కనిపించదు కదా)’’ అని మరొక యూజర్ ప్రశ్నించారు.