Viral Video: అమెజాన్ పార్శిల్‌లో నాగుపాము.. షాకైన బెంగళూరు దంపతులు
అమెజాన్ పార్శిల్ బాక్స్ తెరవగానే బెంగళూరు సాఫ్ట్‌వేర్ దంపతులు షాకయ్యారు. అందులో నాగుపాము కనిపించడంతో ఉలిక్కిపడ్డారు.
బెంగళూరుకు చెందిన దంపతులు తమ అమెజాన్ ప్యాకేజీలో నాగుపాము చూసి షాక్ అయ్యామని తెలిపారు. ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నుండి ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. కానీ ప్యాకేజీ అందుకుని ఓపెన్ చేశాక వారు భయబ్రాంతులకు గురయ్యారు. పార్శిల్ తెరవగానే పాము కనిపించడంతో షాకయ్యారు.
‘మేం 2 రోజుల క్రితం అమెజాన్ నుండి ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశాం. ప్యాకేజీలో సజీవంగా ఉన్న పాము కనిపించింది. ప్యాకేజీని డెలివరీ పార్టనర్ నేరుగా మాకు అందజేశారు. మేము సర్జాపూర్ రోడ్డులో నివసిస్తున్నాం. మొత్తం సంఘటనను కెమెరాలో బంధించాం. దీనికి ప్రత్యక్ష సాక్షులు మా వద్ద ఉన్నారు’ అని కస్టమర్ ఇండియా టుడేకు చెప్పారు.
కంపెనీ ఎలా స్పందించింది?
కస్టమర్ తమకు రిఫండ్ లభించిందని చెప్పారు. అయితే ఈ సంఘటన వారి ప్రాణాలకు కలిగించే ప్రమాదం గురించి ప్రశ్నలు లేవనెత్తింది. "మాకు పూర్తిగా రీఫండ్ లభించింది, కానీ ఇక్కడ అత్యంత విషపూరితమైన పాముతో మా ప్రాణాలను పణంగా పెట్టాం. ఇది పూర్తిగా అమెజాన్ యొక్క నిర్లక్ష్యం మరియు వారి పేలవమైన రవాణా, గోదాము పరిశుభ్రత, పర్యవేక్షణ లోపం వల్ల సంభవించిన భద్రతా ఉల్లంఘన. భద్రతలో ఇంత తీవ్రమైన లోపానికి జవాబుదారీతనం ఎక్కడుంది?' అని కస్టమర్ ప్రశ్నించారు.
అయితే సదరు వినియోగదారుడు రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సగం తెరిచిన అమెజాన్ ప్యాకేజీని బకెట్లో ఉంచారు. ప్యాకేజింగ్ టేప్‌లో ఇరుక్కుపోయిన పాము తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
‘వారు పూర్తి రీఫండ్ చెల్లించారు. కానీ అంతకు మించి మాకు ఎలాంటి పరిహారం గానీ, అధికారిక క్షమాపణలు గానీ అందలేదు. మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామంటూ రొటీన్ సమాధానం ఇచ్చారు. ఇది అమెజాన్ కస్టమర్లుగా మాకు, ఉద్యోగిగా వారి డెలివరీ భాగస్వామికి అన్ని విధాలుగా ఆమోదయోగ్యం కాదు. ఇది భద్రతా ఉల్లంఘనే. మేం సంతృప్తికరమైన పరిష్కారాన్ని పొందుతామని కూడా నేను అనుకోవడం లేదు" అని కస్టమర్ చెప్పారు. తరువాత పామును బంధించి, సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టారు.
(HT ఈ వైరల్ వీడియోపై కామెంట్ కోసం అమెజాన్‌ను సంప్రదించింది. కానీ ఇంకా జవాబు రాలేదు.)